English | Telugu
'బంగార్రాజు'లో చైతూ కాసనోవాలా కనిపిస్తాడంట!
Updated : Aug 25, 2021
2016 నాటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం `బంగార్రాజు`. ఇందులో టైటిల్ రోల్ లో కింగ్ నాగార్జున నటిస్తుండగా.. మరో హీరోగా యువ సామ్రాట్ నాగచైతన్య కనిపించనున్నారు. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నాగ్ సరసన రమ్యకృష్ణ కొనసాగుతుండగా.. చైతూకి జంటగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి దర్శనమివ్వనుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా.. తాజాగా రెగ్యులర్ షూటింగ్ బాట పట్టింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చైతన్య పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. `బంగార్రాజు` మనవడి పాత్రలో చైతూ కనిపిస్తాడని.. తాత లాగే ఈ పాత్ర కూడా `కాసనోవా` అని టాక్. అంతేకాదు.. మనవడిని కాస్త ట్రాక్ లోకి పెట్టేందుకు తాత బంగార్రాజు దివి నుండి భువికి దిగి వస్తాడట. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ వినోదభరితంగా సాగుతాయని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్న `బంగార్రాజు`ని 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నాగ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందని బజ్.