English | Telugu

తార‌క్‌, 100 మంది బ్రిటీష‌ర్స్.. ఓ యాక్ష‌న్ సీక్వెన్స్!

యావ‌త్ భార‌త‌దేశ‌మంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా `ఆర్ ఆర్ ఆర్`. `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న ఈ పాన్ - ఇండియా మూవీలో యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారు. చారిత్ర‌క‌ పురుషులు అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ స్నేహం చుట్టూ అల్లుకున్న ఈ క‌ల్పిత గాథ‌లో అల్లూరి గా చ‌ర‌ణ్, కొమురంగా తార‌క్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. దాదాపు చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ పిరియ‌డ్ డ్రామాని విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయాల‌ని యూనిట్ ప్లాన్ చేస్తోంది. కుద‌ర‌ని ప‌క్షంలో వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో ఈ సినిమా తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే.. `ఆర్ ఆర్ ఆర్` హైలైట్స్ కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. ఇందులో వంద‌మంది బ్రిటీష‌ర్స్ తో కొమురం (తార‌క్‌) త‌ల‌ప‌డే ఓ స‌న్నివేశ‌ముంద‌ట‌. అది.. సినిమా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌ల‌లో ఒక‌టిగా నిలుస్తుంద‌ని బ‌జ్. 20 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిపిన ఈ సీక్వెన్స్ కి.. థియేట‌ర్స్ లో గూస్ బంప్స్ ప‌క్కా అంటున్నారు. అంతేకాదు.. ఈ స‌న్నివేశం కోస‌మే భారీ మొత్తాన్నే వెచ్చించార‌ట‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

వి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ర‌చ‌న చేసిన ఈ సినిమాకు ఎం.ఎం. కీర‌వాణి సంగీత ద‌ర్శ‌కునిగా, సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు.