English | Telugu

హీరోగా బండ్ల గణేష్.. ఆ సినిమానే రీమేక్ చేస్తున్నారా?..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు బండ్ల గణేష్. గబ్బర్ సింగ్, టెంపర్ వంటి హిట్ సినిమాలను నిర్మించిన ఆయన.. కొన్నేళ్లుగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. సత్తా చాటుదాం అనుకొని బొక్క బోర్లా పడ్డారు. ఆ తర్వాత మళ్ళీ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలో బండ్ల గణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది.

వెంకట్ ఓ కొత్త దర్శకుడు బండ్ల గణేష్ ను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కథ ప్రకారం.. కాంట్రవర్శియల్ అండ్ ఫన్నీ ఇమేజ్ ఉన్న రోల్ అని తెలుస్తోంది. ఈ పాత్రకు బండ్ల గణేష్ సూట్ అవుతారని భావించిన డైరెక్టర్.. ఆయన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఇక కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన 'మండేలా' చిత్రాన్ని బండ్ల గణేష్ రీమేక్ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు కొత్త దర్శకుడు వెంకట్ చేయాలని చూస్తున్న సినిమా అదేనా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒకవేళ అదే నిజమైతే మండేలా పాత్రలో బండ్ల గణేష్ ఎలా అలరిస్తారో చూడాలి.