English | Telugu

గబ్బర్ సింగ్ కి పోటీగా భక్తుడు గణేష్

 

ఎప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ జపం చేస్తూ ఉండే నిర్మాత బండ్ల గణేష్ త్వరలో పవన్ కు శత్రువు కాబోతున్నాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "తీన్ మార్" తర్వాత "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్ర ఆడియో కార్యక్రమంలో గణేష్ మాట్లాడిన మాటలు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. "పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. నిజాయితీ అంటే పవన్ కళ్యాణ్... పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ. నా జీవితాంతం ఆయనకు ఋణపడి ఉంటాను" అంటూ అబ్బో... పెద్ద పెద్ద డైలాగులే చెప్పాడు గణేష్.

ఆ తర్వాత ఎన్టీఆర్ తో "బాద్ షా" సినిమా తీసాడు. ఆ సినిమా ఆడియో వేడుకలో ఎన్టీఆర్ జపం చేసాడు. అయితే సీన్ కట్ చేస్తే పవన్ ఇపుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. పార్టీ పెట్టేశాడు. కానీ పవన్ కాంగ్రెస్ పార్టీపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా నిర్మాత బండ్ల గణేష్ ఎన్నికల్లో నిలబడటానికి సిద్ధమవుతున్నాడని సమాచారం.

కాంగ్రెస్ లీడర్ బొత్స సత్యనారాయణతో బండ్ల గణేష్ కు బాగానే సన్నిహిత్యం ఉన్నది. అలాంటి బొత్స ద్వారా మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. మరి ఇన్ని రోజులు పవన్ నిజాయితీకి మరోపేరు అని చెప్పిన గణేష్ "జనసేన" పార్టీలో చేరకుండా ఇలా కాంగ్రెస్ లో చేరడమేంటి? అంటే ఇన్ని రోజులు పవన్ గురించి చెప్పినది అంతా అబద్దమేనా? గణేష్ కేవలం తన స్వలాభం కోసమే పవన్ పేరు జపించాడా? ఈ ప్రశ్నలకు సమాధానం మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.