English | Telugu

నాగ్ బాలయ్య ఒకే చిత్రంలో

నాగ్ బాలయ్య ఒకే చిత్రంలో నటిస్తున్నారని సమాచారం. వివరాల్లోకి వెళితే యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, యువరత్న నందమూరి బాలకృష్ణ కలసి ఒకే చిత్రంలో నటించనున్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. మళయాళంలో మోహన్ లాల్, సురేష్ గోపి, దిలీప్, శరత్ కుమార్ కలసి నటించిన "క్రిస్టియన్ బ్రదర్స్" అనే చిత్రం సూపర్ హిట్టయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోలుగా రీమేక్ చేయాలని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నిస్తున్నారట.

 

గతంలో మన తెలుగు సినీ పరిశ్రమను ఏలిన రారాజులు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నటరత్న నందమూరి తారక రామారావు ఇద్దరూ కలసి "మిస్సమ్మ", "గుండమ్మకథ" "శ్రీకృష్ణార్జున యుద్ధం" వంటి దాదాపు పదహారు చిత్రాల్లో కలసి నటించారు. కానీ వారి వారసులైన యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, యువరత్న నందమూరి బాలకృష్ణ ఇద్దరూ సినీ పరిశ్రమకు వచ్చి ఇరవయ్యేళ్ళకు పైగా అవుతున్నా వాళ్ళిద్దరూ కలసి ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. ఈ "క్రిస్టియన్‍ బ్రదర్స్" చిత్రాన్ని యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, యువరత్న నందమూరి బాలకృష్ణలతో రీమేక్ చేస్తే ఆ ఘనత నిర్మాత బెల్లంకొండ సురేష్ కే దక్కుతుంది.