English | Telugu
బెస్ట్ ఫ్రెండ్స్ గా బాలయ్య, రవితేజ!
Updated : Apr 10, 2022
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా దర్శనమివ్వనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారు. షైన్ స్క్రీన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. అక్టోబర్ లో పట్టాలెక్కనుందని సమాచారం. ఇందులో బాలయ్య ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా, ఇందులో రవితేజ కూడా కాప్ గానే దర్శనమిస్తారట. అంతేకాదు.. బాలయ్య, రవితేజ బెస్ట్ ఫ్రెండ్స్ రోల్స్ లో ఎంటర్టైన్ చేయనున్నారని టాక్. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే, బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. మరోవైపు రవితేజ చేతిలో `రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా`, `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలు ఉన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు బాబీ కాంబో మూవీలోనూ రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.