English | Telugu

అనుష్క వ‌ల్ల బాహుబ‌లికి రూ.20 కోట్లు న‌ష్ట‌మా?

అనుష్క లాంటి క‌థానాయిక ఉండ‌డం ఏ సినిమాకైనా ప్ల‌స్ పాయింట్ అవుతుంది. త‌న అందం, న‌ట‌న‌, చ‌రిష్మా, ఇమేజ్‌తో త‌న పాత్ర‌ని ర‌క్తిక‌ట్టించ‌డ‌మే కాదు.. ఆ సినిమా స్థాయిని కూడా అనుష్క పెంచేస్తుంది. అందుకే.. అనుష్క‌ని క‌థానాయిక‌గా ఎంచుకోవ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎగ‌బ‌డుతుంటారు. అయితే.. బాహుబ‌లి విష‌యంలో అనుష్క ప్ల‌స్ అవ్వాల్సింది పోయి.. త‌నే మైన‌స్ అయి కూర్చుంది. అవును.. ఇది నిజం. బాహుబ‌లిలో దేవ‌సేన పాత్ర‌లో అనుష్క క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ పాత్ర‌లో ఆమె అద్భుతంగా న‌టించి ఉండొచ్చు గాక‌.. కానీ అనుష్క వ‌ల్లే బాహుబ‌లి సినిమాకి భారీ న‌ష్టం జ‌రిగింది అంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు.

బాహుబ‌లి 1కీ బాహుబ‌లి 2కీ మ‌ధ్య అనుష్క బాగా లావైపోయిన సంగ‌తి తెలిసిందే. ఆమె బొద్దుగా మార‌డ‌మే బాహుబ‌లి టీమ్‌కి స‌మ‌స్య‌ని తెచ్చిపెట్టింద‌ట‌. బాహుబ‌లి 2లోని చాలా స‌న్నివేశాల్ని బాహుబ‌లి 1 స‌మ‌యంలోనే తెర‌కెక్కించేశారు. ఇప్పుడు ఆయా సన్నివేశాల‌న్నీ మ‌ళ్లీ రీషూట్ చేయాల్సివ‌చ్చింద‌ట‌. అనుష్క ఒక్కో సీన్‌లో ఒక్కోలా క‌నిపించ‌డం రాజ‌మౌళికి ఇష్టం లేద‌ని, అందుకే.. న‌ష్టం వ‌స్తుంద‌ని తెలిసినా 2014లో అనుష్క‌పై తెర‌కెక్కించిన స‌న్నివేశాల‌న్నీ తొల‌గించి, వాటి స్థానంలో 2016లో మ‌ళ్లీ కొత్త‌గా స‌న్నివేశాల్ని తెర‌కెక్కించార‌ని, ఈ రీషూట్ వ‌ల్ల‌ క‌నీసం రూ.20 కోట్లయినా న‌ష్టం వాటిల్లి ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అనుష్క‌కీ రాజ‌మౌళికీ మ‌ధ్య విబేధాలు మొద‌ల‌య్యాయ‌ని, సెట్లో అంద‌రి ముందు అనుష్క‌కి రాజ‌మౌళి క్లాస్ పీకాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. దానికి కార‌ణం.. ఈ రీషూట్లే అని తెలుస్తోంది.