English | Telugu

దేవ‌క‌న్య‌తో ప్ర‌భాస్ ప్రేమాయ‌ణం?

బాహుబ‌లి ప్ర‌బాస్ త్వ‌ర‌లో డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌భాస్ న‌టించే ఈ 21వ సినిమాను ప్ర‌క‌టించిన నాటి నుంచి, దాని క‌థ గురించి ర‌క‌ర‌కాలుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. ఈ పాన్ ఇండియ‌న్ మూవీని రూ. 400 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించేందుకు వైజ‌యంతీ మూవీస్ అధినేత చ‌ల‌సాని అశ్వినీద‌త్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అత్యంత ఆత్రుత‌తో ఎదురుచూస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.

ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వినిపిస్తున్న దాని ప్ర‌కారం సోషియో ఫాంట‌సీ, సైన్స్ ఫిక్ష‌న్ మేళ‌వింపుతో ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. ఒక మాన‌వుడికి, ఒక దేవ‌క‌న్య‌కు మ‌ధ్య ప్రేమ‌క‌థ‌గా ఇది ఉంటుంద‌ట‌. చూస్తుంటే చిరంజీవి, శ్రీ‌దేవి జంట‌గా న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ మూవీ 'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి'కి సీక్వెల్‌గా ఉండ‌వ‌చ్చ‌ని అనిపిస్తోంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ ఒక సూప‌ర్ హీరోగా క‌నిపిస్తాడ‌ని ఇదివ‌ర‌కే ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆ ర‌కంగా చూసినా.. ఇప్పుడు వినిపిస్తోన్న క‌థ‌కు అది స‌రిగ్గా స‌రిపోతుంది.

తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ మూవీని విడుద‌ల చేయాల‌నేది అశ్వినీద‌త్ ఆలోచ‌న‌. ఈ మూవీలో ప్ర‌భాస్ జోడీగా ఎవ‌రు న‌టిస్తారో తెలుసుకోవాల‌ని ఫ్యాన్స్ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం పూజా హెగ్డేతో ప్ర‌భాస్ ఓ సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.