English | Telugu

చిరుకి నో చెప్పిన న‌య‌న్ విల‌న్?

లేడీసూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన కోలీవుడ్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ `ఇమైక్క నోడిగ‌ళ్` (తెలుగులో `అంజ‌లి సీబీఐ` పేరుతో అనువాద‌మైంది)లో విల‌న్ గా న‌టించాడు బాలీవుడ్ ద‌ర్శ‌క‌, న‌టుడు అనురాగ్ క‌శ్య‌ప్. అందులోని త‌న విల‌నిజంతో భ‌య‌పెట్టాడు. ఆ విల‌నిజం న‌చ్చి.. ఓ బ‌డా తెలుగు ప్రాజెక్ట్ కోసం సంప్ర‌దిస్తే సింపుల్ గా నో చెప్పేశాడ‌ట మిస్ట‌ర్ క‌శ్య‌ప్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `లూసిఫ‌ర్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్న‌ ఈ పొలిటిక‌ల్ డ్రామాని `హ‌నుమాన్ జంక్ష‌న్` ఫేమ్ మోహ‌న్ రాజా డైరెక్ట్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం పూర్వ‌నిర్మాణ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమాని.. అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి తీసుకెళ్ళ‌బోతున్నారు. ఈ క్ర‌మంలోనే.. ఆయా పాత్ర‌ల‌కి న‌టీన‌టుల అన్వేష‌ణ‌లో ఉన్నారు ద‌ర్శ‌కుడు మోహ‌న్. ఇందులో భాగంగా.. విల‌న్ వేషాన్ని అనురాగ్ తో చేయించాల‌నుకున్నారు. అయితే, అనురాగ్ మాత్రం ఏవేవో కార‌ణాల‌తో ఈ ఆఫ‌ర్ ని రిజెక్ట్ చేశార‌ని టాక్. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో నిజానిజాలెంతో తెలియాల్సింది.