English | Telugu

వెంకీతో ముచ్చ‌ట‌గా మూడోసారి!

సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన నాయిక‌ల్లో తెలుగమ్మాయి అంజ‌లి ఒక‌రు. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' (2013) కోసం తొలిసారి జ‌ట్టుకొట్టి హిట్టుకొట్టిన ఈ కాంబినేష‌న్.. ఆపై అదే ఏడాదిలో రిలీజైన‌ 'మ‌సాలా' కోసం ఆడిపాడారు. క‌ట్ చేస్తే.. ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం ఈ ఇద్ద‌రూ ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. 2019 నాటి సంక్రాంతి బ్లాక్‌బ‌స్ట‌ర్ 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్న ఈ సినిమాలో వారికి జోడీగా త‌మ‌న్నా, మెహ‌రీన్ సంద‌డి చేయ‌నున్నారు. అలాగే ఈ సినిమాలో మ‌రో నాయిక పాత్ర కూడా ఉంద‌ని.. అందులో 'లెజెండ్' ఫేమ్ సోనాల్ చౌహాన్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇప్పుడా పాత్ర‌లో అంజ‌లి క‌నిపిస్తుంద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే 'ఎఫ్ 3'లో అంజ‌లి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు', 'వ‌కీల్ సాబ్' చిత్రాల్లో అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించింది. 'ఎఫ్ 3'కి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. దేవి శ్రీప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నారు. ఆగ‌స్టు 27న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ జ‌నం ముందుకు రానుంది.