English | Telugu

ప్ర‌భాస్ సినిమాలో దీపిక కంటే అమితాబ్‌కే ఎక్కువ ఫీజు?

బాలీవుడ్ మెగా స్టార్‌ అమితాబ్ బచ్చన్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని అత్యంత సీనియర్ నటులలో ఒకరు. ఇండ‌స్ట్రీకి ఆయ‌న చాలా గొప్ప మూవీస్‌ను అందించారు. ఇప్పటికీ ఆయ‌న యాక్టివ్‌గా ఉన్నారు. ఈ కారణంగా, అమితాబ్ బచ్చన్‌కు ఇంకా డిమాండ్ ఉంది. ప్రొడ్యూస‌ర్లు కూడా ఆయ‌న‌కు భారీ రెమ్యూన‌రేష‌న్‌ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజుల్లో, కేబీసీ వేదికపై కనిపిస్తున్న‌ అమితాబ్ బచ్చన్ త్వరలో ప్రభాస్‌, దీపికా ప‌డుకోనేలతో కలిసి వైజయంత్ మూవీస్ చిత్రంలో కనిపించనున్నారు.

ఇది సి. అశ్వినీద‌త్ క‌ల‌ల ప్రాజెక్ట్‌. కాబ‌ట్టి ఆయ‌న త‌న సినిమాకు ఏ విష‌యంలోనూ రాజీప‌డేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఒక సైన్స్ ఫిక్ష‌న్ ఎపిక్ మూవీని ఆయ‌న నిర్మించ‌బోతున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ న‌టించ‌నున్న‌ట్లు వైజ‌యంతీ మూవీస్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచీ ఆయ‌న రెమ్యూన‌రేష‌న్ గురించి చర్చ ప్రారంభమైంది. దీని గురించి అధికారిక లెక్క‌లేమీ లేన‌ప్ప‌టికీ, అమితాబ్ బచ్చన్‌కు దీపికా పదుకొనే కంటే ఎక్కువ పారితోషికం ఇవ్వ‌నున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చెప్పుకుంటున్నారు.

ఇంత‌కుముందు, ఈ చిత్రం కోసం దీపికా పడుకోనే 12 కోట్ల రూపాయలు తీసుకుంటుందనే విష‌యం వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అమితాబ్ బచ్చన్‌కు దీపిక కంటే ఎక్కువ వేతనం లభిస్తుందని వార్తలు వస్తున్నాయి. అంటే ఈ చిత్రంలో న‌టిస్తున్నందుకు గాను అమితాబ్‌కు రూ. 12 కోట్లకు పైగానే అందుతున్నాయ‌న్న మాట‌. ఎందుకంటే ఈ మూవీలో ఆయ‌న‌ది గెస్ట్ రోలో, స్పెష‌ల్ అప్పీరెన్సో కాద‌నీ, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అనీ, ఆ లెజెండరీ నటుడు ఇచ్చే టైమ్‌కు తాము పూర్తి న్యాయం చేస్తామ‌నీ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. అయితే, ఈ సినిమా టైటిల్, క‌థేమిట‌నే విష‌యాలు ఇంకా వెల్ల‌డి కాలేదు. ఈ చిత్రం 2022లో విడుదల కానుంది.