English | Telugu

రూ. 200 కోట్ల‌కు అమ్ముడైన 'ఆర్ఆర్ఆర్' శాటిలైట్ అండ్ డిజిట‌ల్ రైట్స్‌!

టాలీవుడ్‌లో ఎప్పుడో అగ్ర ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి 'బాహుబ‌లి' సిరీస్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రిగా మారిపోయారు. 'బాహుబ‌లి' తొలి భాగం సూప‌ర్ హిట్ కాగా, రెండో భాగం రికార్డులు బ్రేక్ చేసింది. దేశంలోని ఏ ఇత‌ర భాష నుంచి హిందీలోకి డ‌బ్ అయిన సినిమా రూ. 511 కోట్ల‌ను వ‌సూలు చేసిన చ‌రిత్ర లేదు, తెలుగు నుంచి వ‌చ్చిన ఒక్క 'బాహుబ‌లి 2'కు త‌ప్ప‌. దాంతో రాజ‌మౌళి ప్ర‌స్తుత చిత్రం 'ఆర్ఆర్ఆర్‌'పై అంచ‌నాలు అంబ‌రాన్నంటుతున్నాయ‌నేది మామూలు మాట అవ‌డం స‌హ‌జం.

1920ల కాలం నాటి క‌థ‌తో త‌యార‌వుతున్న ఈ సినిమా మేకింగ్‌లో ఉండ‌గానే బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతో నిర్మాత డి.వి.వి. దాన‌య్య జాక్‌పాట్ కొట్టాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వినిపిస్తున్న‌ది నిజ‌మే అయితే ఈ సినిమా టీవీ, డిజిట‌ర్ రైట్స్‌ను స్టార్ నెట్‌వ‌ర్క్‌కు ఇప్ప‌టికే అమ్మేశారు. 2021లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నే న‌మ్మ‌కంతో ఆ హ‌క్కుల కోసం స్టార్ నెట్‌వ‌ర్క్ ఏకంగా న‌మ్మ‌శ‌క్యం కాని రీతిలో రూ. 200 కోట్లు ఆఫ‌ర్ చేసిందంటున్నారు.

స్టార్ టీవీకి ఇండియాలో హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లోనూ చాన‌ళ్లు ఉన్నాయి. అలాగే ఇండియాలో అత్య‌ధిక సంఖ్య‌లో స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఉంది. అందువ‌ల్లే అన్ని భాష‌ల ఆడియెన్స్‌ను ఆక‌ర్షించగ‌ల‌న‌నే న‌మ్మ‌కంతో ఆ నెట్‌వ‌ర్క్ భారీ మొత్తాన్ని చెల్లించింద‌ని చెప్పుకుంటున్నారు. గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌య‌మేమంటే, థియేట‌ర్ల‌లో విడుద‌లై ఫుల్ ర‌న్ అయ్యాకే టీవీలో కానీ, ఓటీటీలో కానీ అది ప్ర‌సారం కానుండ‌టం.

అల్లూరి సీతారామరాజు, కొమ‌రం భీమ్ పాత్ర‌ల్లో రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, శ్రియ త‌దితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబ‌ర్ 5 నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది.