English | Telugu

'ఐకాన్' అల్లు అర్జున్ కాకుండా మ‌రెవ‌రు?

'ఐకాన్‌'.. రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన సినిమా. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సినిమా. దిల్ రాజు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించాల‌నుకున్న సినిమా. వేణు కూడా 'వ‌కీల్ సాబ్' త‌ర్వాత త‌ను చేయ‌బోయే సినిమా ఐకాన్ అని మీడియా మిత్రుల‌తో చెప్పాడు. అయితే త‌ర్వాత ఏం జ‌రిగిందో ఏమో.. 'ఐకాన్' సినిమాని బ‌న్నీ చేయ‌ట్లేద‌నేది జోరుగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అది నిజ‌మే అన్న‌ట్లు ఆమ‌ధ్య కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో సినిమా చేయ‌నున్న‌ట్లు బ‌న్నీ ప్ర‌క‌టించాడు. అయితే ఆ త‌ర్వాత బ‌న్నీతో కాకుండా జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో కొర‌టాల శివ క‌మిట్ అయ్యాడు. దీంతో బ‌న్నీ ఏం చేస్తున్నాడంటూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతూ వ‌స్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌ల‌వుతున్న 'పుష్ప' రిజ‌ల్ట్ చూశాక‌, అప్పుడు త‌న నెక్ట్స్ ఫిల్మ్‌ను క‌మిట్ అవుతాడంటూ కొంత‌మంది ప్ర‌చారంలోకి తెచ్చారు.

అయితే ఇటీవ‌ల 'ఐకాన్' ప్రాజెక్ట్ ఉంటుంద‌ని దిల్ రాజు ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. శ్రీ‌రామ్ వేణు డైరెక్ట్ చేసే ఆ సినిమా షూటింగ్‌ను త్వ‌ర‌లోనే మొద‌లుపెడ‌తామ‌ని కూడా రాజు చెప్పారు. అయితే ఆ సినిమాలో హీరో ఎవ‌ర‌నే విష‌యంపై ఆయ‌న క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. 'ఐకాన్‌'లో బ‌న్నీ న‌టించ‌ట్లేద‌నేది ఖాయ‌మంటున్నారు. ఇప్ప‌టికే బ‌న్నీ "స్టైలిష్ స్టార్" నుంచి "ఐకాన్ స్టార్‌"గా త‌న పేరును మార్చుకున్నాడు. అత‌నికి ఆ కొత్త‌పేరును పెట్టింది సుకుమార్‌. అది బ‌న్నీకి బాగా న‌చ్చి, ఈమ‌ధ్య జ‌రిగిన 'పుష్ప' ఈవెంట్‌లో దాని గురించి గొప్ప‌గా చెప్పుకుంటూ వ‌చ్చాడు.

అలాంట‌ప్పుడు 'ఐకాన్' అనే టైటిల్ సినిమాని అత‌నే చెయ్యాలి. అదివ‌ర‌కే అది చెయ్య‌డానికి ఒప్పుకున్నాడ‌య్యే. కానీ దిల్ రాజుతో బ‌న్నీకి విభేదాలు వ‌చ్చాయ‌నీ, అందుకే ఆ ప్రాజెక్ట్ నుంచి అత‌ను త‌ప్పుకున్నాడ‌నీ ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు. దాంతో 'ఐకాన్' సినిమాలో ఐకాన్ స్టార్ కాకుండా మ‌రో స్టార్ న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అతి త్వ‌ర‌లోనే 'ఐకాన్' ఎవ‌ర‌నేది వెల్ల‌డి కానున్న‌ది.