English | Telugu

మ‌న హీరోలెవరూ న‌టులు కారా??

తెలుగు చిత్ర‌సీమ‌లో స్టార్స్‌కి కొద‌వ‌లేదు. ఒక్కొక్క‌ స్టార్ ఇంట్లోంచీ.. ఇద్ద‌రు ముగ్గురు స్టార్స్ వ‌స్తున్నారు. వాళ్ల‌కు మ‌ళ్లీ ఫ్యాన్స్ బిరుదులు కూడా ఇచ్చేస్తున్నారు. మాస్ హీరోలుగా ఎదిగివాళ్లూ కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతున్నారు. అంతా బాగానే ఉంది. మ‌రి వీళ్ల‌లో న‌టులెవ‌రు? స్టార్ లెక్క‌లేనంత మంది ఉన్నా అస‌లు సిస‌లు న‌టులు క‌ర‌వ‌య్యారా?? ఔన‌నే అనిపిస్తోంది ప‌రిస్థితి చూస్తేంటే!

స్టార్ ఇంట్లోంచి వ‌చ్చి స్టార్ అయిపోతున్నారే త‌ప్ప‌.. వాళ్ల‌లో టాలెంట్ క‌ర‌వ‌య్యింద‌ని చాలామంది విమ‌ర్శ‌కుల‌ అభిప్రాయం. అప్పుడెప్పుడో ఓ సారి ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు కూడా `ప్లాస్టిక్ మొహాలెసుకొని వ‌చ్చేస్తున్నారు.. వాళ్ల‌నే గ‌తి లేక చూడాల్సివ‌స్తోంది.. న‌చ్చే వ‌ర‌కూ మ‌న‌పై రుద్దేస్తున్నారు.` అంటూ ఓ ఘాటు వ్యాఖ్య కూడా చేశారు. డాన్సులు, ఫైట్ల‌లో ఇర‌గ దీస్తున్నా... న‌ట‌న విష‌యానికొస్తే.. బ్లాంక్ మొహాలేసుకొని క‌నిపిస్తున్నార‌న్న‌ది నిజం. మొన్న‌టికి మొన్న అక్కినేని ఇంట్లోంచి అఖిల్ వ‌చ్చాడు. డాన్సులు బాగా చేశాడ‌నిపించుకొన్నాడు. అయితే... న‌టన విష‌యంలో అఖిల్‌కి అత్తెస‌రు మార్కులే ద‌క్కాయి. నాగ‌చైత‌న్య ప‌రిస్థితీ ఇంతే. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్ల‌యినా.. న‌ట‌న‌లో ఎలాంటి మార్పు రాలేదు. రామ్‌చ‌ర‌ణ్ విష‌యంలోనూ ఇంతే. డాన్సుల్లో చిరుని డామినేట్ చేసేస్తున్నా.. న‌టన విష‌యంలో తండ్రికి ద‌రిదాపుల్లోకి రాలేక‌పోతున్నాడ‌న్న నిజాన్ని మెగా ఫ్యాన్సే ఒప్పుకొన్నారు.

రామ్ యాక్ష‌న్ చేయమంటే ఓవ‌రాక్ష‌న్ చేసేస్తుంటాడు. త‌న న‌ట‌న‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమిటేష‌నే ఎక్కువ‌గా క‌నిపిస్తుందన్న‌ది విమ‌ర్శ‌కుల అభిప్రాయం. రానా ఇప్ప‌టి వ‌ర‌కూ న‌టుడిగా మార్కులు సంపాదించ‌లేక‌పోయాడు. నితిన్ ప‌రిస్థితీ అంతే.. వ‌రుస హిట్ల‌తో అల‌రించిన నితిన్,. న‌టుడిగా పూర్తి స్థాయి ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చ‌లేదు,.

ఇప్ప‌టి త‌రంలో మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్ త‌ప్ప‌.... న‌ట‌న‌లోక్యారిబ‌ర్ చూపించే స‌త్తా ఎవ్వ‌రికీ లేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఇప్పుడు మోక్ష‌జ్ఞ తో నంద‌మూరి నాలుగో త‌రం మొద‌లు కాబోతోంది. కొన్నేళ్ల‌కు మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్‌.. వెంకీ ఇంట్లోంచి అర్జున్ హీరోలుగా రావ‌డం ఖాయం. వాళ్లైనా ప‌రిపూర్ణ‌న‌టులుగా క‌నిపిస్తే.. అదే ప‌ది వేలు. లేదంటే.. మ‌ళ్లీ మ‌ళ్లీ అవే ప్లాస్టిక్ మొహాల్ని, రొడ్డ‌కొట్టుడు యాక్టింగ్ స్కిల్స్‌నీ చూడ‌లేం బాబూ..