English | Telugu
బాలయ్య చిత్రంలో శ్రీ లీల!?
Updated : Feb 15, 2022
గత ఏడాది విజయ దశమికి విడుదలైన `పెళ్ళి సందD`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది శ్రీ లీల. మొదటి ప్రయత్నంలోనే తన నటనతో, నర్తనంతో కుర్రకారుని ఫిదా చేసింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజకి జోడీగా `ధమాకా`లో నటిస్తోందీ అమ్మడు. అలాగే నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్ రాబోయే చిత్రాల్లోనూ శ్రీ లీల నాయికగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీ లీలకి ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ దక్కిందట. ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఓ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ కోసం ఓ ముఖ్య పాత్రలో నటించబోతోందట శ్రీ లీల. అంతేకాదు.. బాలయ్యకి కూతురిగా శ్రీ లీల దర్శనమివ్వనుందని బజ్. అభినయానికి ఆస్కారమున్న పాత్ర కావడంతో వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. త్వరలోనే బాలయ్య - అనిల్ రావిపూడి మూవీలో శ్రీ లీల ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారు. అదయ్యాకే అనిల్ కాంబో మూవీ పట్టాలెక్కుతుంది. మరోవైపు అనిల్ రావిపూడి తాజా చిత్రం `ఎఫ్ 3` మే 27న రిలీజ్ కాబోతోంది.