English | Telugu
'కాంతార' దర్శకుడితో ఎన్టీఆర్.. ఇండియాని షేక్ చేసే కాంబో!
Updated : Aug 17, 2024
ప్రస్తుతం రిషబ్ శెట్టి (Rishab Shetty) పేరు మారుమోగిపోతోంది. 'కాంతార' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుపొందాడు. అయితే రిషబ్ లో గొప్ప నటుడు మాత్రమే కాదు.. గొప్ప దర్శకుడు కూడా ఉన్నాడు. పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న 'కాంతార'కు ఆయనే దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీక్వెల్ ని రూపొందిస్తున్నాడు. దీని తరువాత జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో ఓ సినిమా చేయడానికి రిషబ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండియాలోని ఈ తరం గొప్ప నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన నటనకు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతారు. తెలుగు హీరోలలో తనకు ఎన్టీఆర్ అంటే ఇష్టమని.. రిషబ్ కూడా పలు సందర్భాల్లో చెప్పాడు. అంతేకాదు, ఎన్టీఆర్-రిషబ్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆమధ్య ఎన్టీఆర్ బెంగళూరు వెళ్లగా.. అక్కడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీతో పాటు, రిషబ్ కూడా కలిశాడు. ఆ సమయంలో ఎన్టీఆర్-రిషబ్ ఒకరినొకరు హత్తుకొని బ్రదర్స్ లా ఫొటోకి ఫోజిచ్చారు. ఆ ఫొటో చూసి ఫ్యాన్స్ ఎంతో మురిసిపోయారు. ఇక తాజాగా రిషబ్ నేషనల్ అవార్డు గెలిచిన సందర్భంగా.. మిగతా సెలబ్రిటీల కంటే ముందు ఎన్టీఆరే విష్ చేశాడు. ఇలా ఇద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది. అయితే ఇప్పుడు ఈ బాండింగే.. ఒక బిగ్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టేలా చేస్తుందని సమాచారం.
దర్శకుడిగా రిషబ్ తన నెక్స్ట్ మూవీని ఎన్టీఆర్ తో చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ ని కూడా రెడీ చేసి వినిపించగా, ఎన్టీఆర్ కి నచ్చిందని వినికిడి. 'కాంతార' ప్రీక్వెల్ విడుదలయ్యాక.. ఈ స్క్రిప్ట్ పై రిషబ్ కూర్చోనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. దీని తర్వాత బాలీవుడ్ ఫిల్మ్ 'వార్ 2'తో పాటు, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, 'దేవర-2' లైన్ లో ఉన్నాయి. వీటి తర్వాత రిషబ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశముంది అంటున్నారు. అదే జరిగితే.. ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఓ రేంజ్ లో నెలకొంటాయి అనడంలో సందేహం లేదు.