English | Telugu

ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా జెండా పీకేస్తాడా??

ప్ర‌శ్నించ‌డానికే ప్ర‌జల ముందుకు వ‌స్తున్నా - అంటూ జ‌న‌సేన పార్టీ స్థాపించాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆయ‌న ప‌వ‌ర్ ఫుల్ ప్ర‌సంగాలు అభిమానుల్నీ, ఆశేష తెలుగు ప్ర‌జానికాన్నీ ఉర్రూత‌లూగించాయి. ప‌వ‌న్ నిజాయ‌తీ గురించి తెలిసిన అభిమానులు ప‌వ‌న్‌కి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కాంగ్రెస్ హ‌ఠావో దేశ్ కో బ‌జావో నినాదం కూడా మార్మోగిపోయింది. ప‌వ‌న్ ప్ర‌చారం ఇటు ప్ర‌త్య‌క్షంగానూ, అటు ప‌రోక్షంగా టీడీపీ, బీజేపీల‌కు సాయం చేసింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు తూట్లు పొడిచేలా చేసింది. ప‌వ‌న్ పార్టీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోయినా... గట్టిగానే ప్ర‌భావితం చేయ‌గ‌లిగాడు. అయితే ఎన్నిక‌ల త‌ర‌వాత పార్టీ ఊసే లేదు. అస‌లు కార్యాచ‌ర‌ణ క‌మిటీ కూడా ఏర్పాటు కాలేదు. అస‌లు ఆఫీసు వ్య‌వహారాలేవీ స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం లేదు. ప‌వ‌న్ త‌ప్ప‌.. జ‌న సేన గురించి మాట్లాడేవాడే లేడు. ఇప్పుడు మొత్తానికే పార్టీ ఎత్తేస్తున్నార‌న్న‌ది లేటెస్ట్ టాక్‌. తాను వ‌చ్చిన ప‌ని అయిపోయినందు వ‌ల్ల పార్టీని టీడీపీలోగానీ, బీజేపీలోగానీ విలీనం చేసేద్దామ‌ని గ‌ట్టిగా ఫిక్స‌య్యాడ‌ట‌. అందుకే జ‌న సేన‌న గురించి ప‌ట్టించుకోకుండా... సినిమాల‌తో బిజీ అయిపోయాడ‌ని ప‌వ‌న్ స‌న్నిహితులు కూడా ఓ హింట్ లాంటిది ఇస్తున్నారు. ఆల్రెడీ అన్న‌య్య ప్ర‌జారాజ్యం స్థాపించి కాంగ్రెస్‌లో విలీనం చేసేసి చేతులు దులుపుకొన్నాడు. ఇప్పుడు ప‌వ‌న్ కూడా అన్న‌బాట‌లోనే న‌డుస్తాడా? అన్న అనుమానాలు ఎక్కువైపోయాయి. ప్ర‌జారాజ్యం ఎప్పుడైతే క‌లిపేశాడో అప్పుడే చిరు ఇమేజ్ దారుణంగా దెబ్బ‌తింది. అభిమానులే చిరుని చీద‌రించుకోవ‌డం మొద‌లెట్టారు. మ‌రి ప‌వ‌న్ కూడా అలాంటి త‌ప్పు చేస్తాడంటారా?? లేదంటే పార్టీ రూపు రేఖ‌లు మార్చి, కార్యాచ‌ర‌ణ క‌మిటీలాంటిది ఏర్పాటు చేసి.. జ‌న‌సేన జ‌నం పార్టీగా మారుస్తాడంటారా? ఏమో మ‌రి ప‌వ‌న్ మ‌న‌సులో ఏముందో ఆయ‌న‌కే తెలియాలి.