English | Telugu

సెంటిమెంట్లు వ‌ద్దుబాబోయ్ అంటున్న ప్రిన్స్‌

చిత్ర‌సీమ‌లో సెంటిమెంట్ల‌కు కొద‌వ లేదు. ఫ‌లానా క‌థానాయిక సినిమాలో ఉంటే క‌చ్చితంగా హిట్ అన్న పేరొచ్చింద‌నుకోండి.. ఆ అమ్మాయి గోల్డెన్ లెగ్ అయిపోతుంది. ఫ‌లానా డైరెక్ట‌రూ, ఫ‌లానా హీరో క‌లిస్తే కాసుల పంటే అనుకొంటే - ఇక ఆ కాంబినేష‌న్ చుట్టు నిర్మాత‌లు చ‌క్క‌ర్లు కొడుతుంటారు. టైటిళ్ల విష‌యంలోనూ సెంటిమెంట్ బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది. గోపీచంద్ త‌న టైటిల్లో సున్నా వ‌చ్చేట్టు చూసుకొంటాడు. ఇలాంటి సెంటిమెంటు మ‌హేష్ బాబుకీ ఉంది. మూడ‌క్ష‌రాల టైటిళ్లు పెట్టుకొంటే బాగా క‌లిసొచ్చింది. మురారి నుంచి దూకుడు వ‌ర‌కూ మ‌హేష్ మూడ‌క్ష‌రాల టైటిళ్లు దాదాపుగా హిట్స్ అయ్యాయి. తాజాగా మ‌హేష్ కొత్త చిత్రానికీ మూడ‌క్ష‌రాల టైటిల్ పెట్టాల‌ని చిత్ర‌బృందం తెగ తాప‌త్ర‌య‌ప‌డుతోంది. మ‌హేష్ - కొర‌టాల శివ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాకోసం ప‌లు పేర్లు ప‌రిశీలిస్తున్నారు. మ‌హేష్ కి మూడ‌క్ష‌రాల సెంటిమెంట్ ఉంద‌ని దానికి త‌గిన టైటిళ్లు దాదాపు డ‌జ‌ను రాసుకొని మ‌హేష్ ముందుంచార‌ట‌. వాట‌న్నింటికీ ప‌క్క‌న పెట్టేశాడు ప్రిన్స్‌. నాకు కావ‌ల్సింది సెంటిమెంట్ కాదు, క్యాచీగా ఉండే టైటిల్ చూడండి - ప‌వ‌ర్ త‌గ్గినా ఫ‌ర్లేదు, టైటిల్‌తో అంచ‌నాలు పెంచేయ‌కండి.. అంటూ గ‌ట్టిగా వార్నింగ్ లాంటిది ఇచ్చాడంట‌. సెంటిమెంట్లు అస్స‌లు ప‌ట్టించుకోవ‌ద్దు..... ఆ మాట‌కొస్తే ఈసారి మూడ‌క్ష‌రాల టైటిల్ వ‌ద్దు అని త‌న టీమ్‌కి సూచించాడ‌ట‌. మొత్తానికి `ఆగ‌డు` ఎఫెక్ట్ మ‌హేష్‌పై బాగానే ప‌డింది. మ‌రి ఈసారి ఎలాంటి టైటిల్ పెడ‌తారో మ‌రి..??