English | Telugu
`ఖిలాడి`తో హెబ్బా పటేల్ చిందులు?
Updated : Jun 11, 2021
కెరీర్ ఆరంభంలో `అలా ఎలా`, `కుమారి 21 ఎఫ్`, `ఈడో రకం ఆడో రకం`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`.. ఇలా వరుస విజయాలతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది ఉత్తరాది సోయగం హెబ్బా పటేల్. అయితే, ఆ తరువాత ఆమె నాయికగా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ ని మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. అతిథి పాత్రలు, ఐటమ్ పాటలు అంటూ రూట్ మార్చింది మిస్ పటేల్. యూత్ స్టార్ నితిన్ నటించిన `భీష్మ`లో స్పెషల్ రోల్ లో సందడి చేసిన హెబ్బా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ `రెడ్`లో `డించక్ డించక్` అంటూ సాగే ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది.
కట్ చేస్తే.. త్వరలో ఈ హాట్ బ్యూటీ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో డ్యాన్స్ నంబర్ చేయనుందట. ఆ వివరాల్లోకి వెళితే.. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా `ఖిలాడి` పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రవితేజకి జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయత్ నాయికలుగా నటిస్తున్నారు. కాగా, కథానుసారం ఇందులో ఓ ప్రత్యేక గీతానికి స్థానముందట. అందులో రవితేజతో కలిసి హెబ్బా పటేల్ చిందులేయనుందని ప్రచారం సాగుతోంది. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హెబ్బా చేతిలో `ఓదెల రైల్వేస్టేషన్`, `తెలిసినవాళ్ళు` అనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి.