English | Telugu

బ‌న్నీ కోసం గౌత‌మ్ కాప్ స్టోరీ?

ద‌ర్శ‌కుడిగా గౌత‌మ్ మీన‌న్ ది ఇర‌వై ఏళ్ళ ప్ర‌స్థానం. ఈ ప్ర‌యాణంలో అటు ప్రేమ‌క‌థా చిత్రాల‌తోనూ, ఇటు స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్ తోనూ మెప్పించారు. ముఖ్యంగా.. కాప్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచారు గౌత‌మ్. తెలుగులోనూ విక్ట‌రీ వెంక‌టేశ్ తో ఘ‌ర్ష‌ణ అనే ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ స్టోరీ చేసిన గౌత‌మ్.. ఆపై యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో సాహ‌సం శ్వాస‌గా సాగిపో చేశారు. క‌ట్ చేస్తే .. స్వ‌ల్ప విరామం త‌రువాత తెలుగులో మ‌రో కాప్ స్టోరీ కి స్కెచ్ వేశార‌ట గౌత‌మ్‌. అది కూడా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళంలోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తూ వ‌స్తున్న గౌత‌మ్ అడ‌పాద‌డ‌పా తెలుగులోనూ సినిమాలు చేస్తున్నారు. ఘ‌ర్ష‌ణ‌, ఏమాయ చేశావె, ఎటో వెళ్ళిపోయింది మ‌న‌సు, సాహ‌సం శ్వాస‌గా సాగిపో.. ఇలా కొన్ని స్ట్ర‌యిట్ పిక్చ‌ర్స్ చేశారు. తాజాగా.. బ‌న్నీ కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ స్టోరీని సిద్ధం చేశార‌ట‌. రేసుగుర్రంలో కాసేపు యూనిఫామ్ లో మెరిసిన వైనం త‌ప్ప.. ఫుల్ లెన్త్ కాప్ రోల్ ని అల్లు అర్జున్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ క‌థ‌కి బ‌న్నీ అయితేనే ఫ్రెష్ గా ఉంటుంద‌ని గౌత‌మ్ భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ మేర‌కు బ‌న్నీతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు గౌత‌మ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి.. గౌత‌మ్ స్కెచ్ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.