English | Telugu

వీరభద్రమ్ వికటాట్టహాసం!

 

దర్శకుడు వీరభద్రమ్ వికటాట్టహాసం చేస్తున్నాడు. అందుకు సరైన కారణమే ఉంది. "అహ నా పెళ్లంట" చిత్రంతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు వీరభద్రమ్. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు. అయితే, ఆ చిత్రం మంచి విజయమే సాధించినప్పటికీ, ఆ చిత్ర విజయంలో దర్శకుడిగా వీరభద్రమ్ పాత్ర చాలా పరిమితమైనదనే ప్రచారం పరిశ్రమవర్గాల్లో జరిగిపోయింది.

 

ఆ తర్వాత వీరభద్రమ్ దర్శకత్వంలో వచ్చిన "పూలరంగడు" కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది. అయితే.. ఆ చిత్ర కథానాయకుడు సునీల్ ప్రతీది దగ్గరుండి చూసుకున్నాడని, ఈ చిత్రానికి సంబంధించిన క్రెడిట్ కూడా వీరభద్రమ్‌ది కాదని కరాఖందిగా తేల్చిపారేసారు. అయితే.. "పూలరంగడు" అనంతరం సునీల్ నటించిన "మిస్టర్ పెళ్లికొడుకు" ఘోరపరాజయం పాలవ్వగా.. తదుపరి చిత్రం "తడాఖా" సోసో అనిపించుకుంది. అలాగే.. "అహ నా పెళ్లంట" చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర దర్శకుడిగా మారి రూపొందించిన "యాక్షన్ ౩డి" పూర్తిగా నిరాశపరిచింది. దాంతో వీరభద్రమ్ విజయగర్వంతో వికటాట్టహాసం చేస్తున్నాడని తెలుస్తోంది!