English | Telugu
డిజాస్టర్స్ @ 2015
Updated : Dec 21, 2015
2015 పేరు చెప్పగానే బాహుబలి, శ్రీమంతుడు లాంటి సూపర్ డూపర్ హిట్సే కాదు... అఖిల్, కిక్ 2 లాంటి డిజాస్టర్లు కూడా గుర్తొస్తాయ్. నిజం చెప్పాలంటే ఈ యేడాది హిట్లకంటే.. అట్టర్‌ఫ్లాప్స్ అయిన సినిమాల జాబితానే పెద్దదిగా కనిపిస్తోంది. చిత్రసీమకు ఫ్లాపులూ, అట్టర్ ఫ్లాపులూ మామూలే. అయితే ఈ యేడాది భారీ అంచనాలు పెట్టుకొచ్చిన సినిమాలు బాక్సాఫీసు ముందు బొక్కబోర్లా పడ్డాయి. కోట్లు దండుకొంటాయిలే అని ఆశల పల్లకి ఎక్కించి.. పెట్టుబడిలో సగం రాబట్టుకోవడానికి నానా తంటాలు పడ్డాయి. ఇటు అభిమానుల్నీ, అటు బయ్యర్లనూ పూర్తిగా నిరాశ పర్చి, భారీ నష్టాల్ని మిగిల్చిన డిజాస్టర్లను ఓసారి పరిశీస్తే. 2015 ఎంత పని చేసిందో అర్థమవుతుంది.
1.మెగా బోణి....
ఈయేడాది తొలి దెబ్బ... మెగా హీరో సినిమాతో పడడం విశేషం.. అదే రేయ్! దాదాపు మూడేళ్ల పాటు నత్తనడక నడిచి, అనేక వాయిదాల మధ్య విడుదలైన రేయ్... అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాపై దాదాపు రూ.30 కోట్లు ఖర్చుపెట్టాడు వైవిఎస్ చౌదరి. కనీసం రూ.10 కోట్లు కూడా రాబట్టుకోలేకపోయింది. ఈసినిమా తరవాత వైవిఎస్ చౌదరి మరో సినిమా ప్రకటించడానికి కూడా ధైర్యం చేయలేదంటే ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు.
2. అక్కినేని వారసుడిది కూడా
ఆ తరవాత నాగచైతన్య సినిమా `దోచేయ్` ఫలితం కూడా నిరాశనే మిగిల్చింది. భారీ అంచనాలతో వచ్చిన సినిమాకి రెండో రోజు నుంచే ప్రేక్షకులు కరువయ్యారు.
3. నందమూరి వారికి తప్పలేదు
లెజెండ్ లాంటి సూపర్ డూపర్ హిట్ తరవాత వచ్చిన నందమూరి బాలకృష్ణ సినిమా లయన్. లెజెండ్ ని దృష్టిలో ఉంచుకొని. బయ్యర్లు ఈ సినిమా కొనడానికి ఎగబడ్డారు. అయితే లయన్ గర్జించలేదు. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా కనీస వసూళ్లను కూడా రాబట్టుకోలేకపోయింది.తొలి రోజు వసూళ్లు తప్ప.. మరేం మిగల్లేదు.
4. మాస్ మహారాజ్ ...కూడా ఫెయిల్
ఆగస్టులో కిక్ 2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. రవితేజ- సురేందర్ రెడ్డిల కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వడంతో ఈ సినిమాపై ఆశలు, అంచనాలు పెరిగిపోయాయి. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ ప్లాపుల జాబితాలో చేరిపోయింది. సురేందర్ రెడ్డి ఈ సినిమాని కావాలని ఫ్లాప్ చేశాడన్న విమర్శలూ వచ్చాయి. ఈ సినిమా తరవాత సురేందర్ రెడ్డికీ, కల్యాణ్ రామ్‌కీ మనస్పర్థలు వచ్చాయని చెప్పుకొన్నారు.. అలా.. కిక్ 2 ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టింది.
5. కొరియర్ లేట్ మాత్రమె కాదు...ఫెయిల్ కూడా
అనేక వాయిదాల నడుమ వచ్చిన కొరియర్ బోయ్ కల్యాణ్ కూడా... తీవ్రంగా నిరాశ పర్చి.. నితిన్ కెరీర్‌కు సడన్ బ్రేకులు వేసింది.
6. పాపం రామ్ ...హోం వర్క్ సరిగ్గా చేయలేదు
రామ్ నటించిన శివమ్.. రెండో రోజు నుంచే థియేటర్లలో కనిపించలేదు. రామ్ కెరీర్‌లో ఇది అత్యంత భారీ ఫ్లాప్.
7. మరో నందమూరి వారసుడు కూడా అదే దారి పట్టాడు
కల్యాణ్ రామ్ షేర్ కూడా వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోయింది. రూ.20 కోట్లు ఖర్చు పెడితే... రూ.5 కోట్లకు మించి వసూళ్లు రాబట్టుకోలేకపోయింది.
8. మెగా పవర్ కి ఏమయ్యింది ?
శ్రీనువైట్ల ఎన్నో నమ్మకాలు పెట్టుకొన్న బ్రూస్లీ కూడా ఫ్లాపుల లిస్టులో చేరిపోయింది. చిరంజీవి ఏడేళ్ల తరవాత మెరుపులాంటి ఎంట్రీ ఇచ్చినా.. ఈ సినిమా గట్టెక్కలేదు. ఈసినిమాతోనే మళ్లీ శ్రీనువైట్ల - కోన వెంకట్ మధ్య విభేదాలు రాజుకొన్నాయి.
9. మొదటి క్లాసు లోనే ఫెయిల్ అయ్యాడు
ఈ యేడాది అత్యంత భారీ ఫ్లాప్‌ల కోసం అక్కినేని అఖిల్‌నటించిన అఖిల్ సినిమా తీవ్రంగా పోటీ పడుతోంది. అఖిల్ హీరోగా నటించిన తొలి సినిమా కావడంతో..దానికి తోడు వినాయక్ దర్శకుడువ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నితిన్ ఈ సినిమాపై రూ.40 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే రూ.20 కోట్లు కూడా రాబట్టుకోలేదు. చివరికి అఖిల్, వినాయక్‌లు తమ పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి దాపురించింది. అఖిల్ - నితిన్‌ల మధ్య మనస్థర్థలు పెంచిన చిత్రంగా ఇది మిగిలిపోయింది.
10. అది నిజ్జంగా జీరోనే
అనుష్క నటించిన సైజ్ జీరో విడుదలకు ముందు ఎంతో హంగామా చేసింది. రిలీజ్ తరవాత కనీసం ఉత్తుత్తి సక్సెస్ మీట్ పెట్టడానికి కూడా నిర్మాతలు ధైర్యం చేయలేదంటే ఈ సినిమా ఎంత గొప్ప ఫ్లాపో అర్థం చేసుకోవచ్చు. అలా.. 2015 మొత్తం డిజాస్టర్లు..వెల్లువెత్తాయి. ఇందులో ది బెస్ట్ డిజాస్టర్ ఏదనే ప్రశ్నకు ప్రేక్షకులే సమాధానం చెప్పాలి.