English | Telugu
ఫొటో స్టోరీ: పెళ్లాడకుండానే ఓ పాపను కని వార్తల్లోకెక్కిన ఫేమస్ ఫిగర్స్!
Updated : Mar 13, 2021
వెటరన్ యాక్ట్రెస్ నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చి, ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇంతకీ ఆమె బిడ్డను కన్నది అలనాటి అరవీర భయంకర వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ వివియన్ రిచర్డ్స్ ద్వారా. అప్పట్లో రిచర్డ్స్‌కు క్రికెట్ ఆడే దేశాల్లో ఉన్న ఇమేజ్ కానీ, క్రేజ్ కానీ మరెవరికీ లేదు. నీనాకు కూడా ఆయనంటే పిచ్చి. ఆయన వివాహితుడు అని తెలిసి కూడా ప్రేమలోపడి, శారీరకంగా ఒక్కటై కూతుర్ని కన్నారు. ఆ పాపకు తండ్రి రిచర్డ్స్ అని ప్రకటించారు. పాపకు మసాబా అని పేరు పెట్టుకున్నారు. ఒక్క చేత్తో కూతుర్ని పెంచి పెద్దచేశారు. పెళ్లి కాకుండా తల్లయినందుకు కానీ, రిచర్డ్స్ తనను పెళ్లి చేసుకోనందుకు కానీ నీనా ఏనాడూ బాధపడలేదు.
మసాబా సైతం తల్లిచాటు బిడ్డగా కాకుండా, చిన్నతనం నుంచే స్వతంత్ర వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంది. ఈరోజున దేశంలోని ఫైనెస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్‌లో మసాబా గుప్తా ఒకరు. ప్రఖ్యాత స్టైల్ మ్యాగజైన్ కల్చర్ ట్రిప్ ఎంపిక చేసిన టెన్ బెస్ట్ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్స్‌లో ఒకరిగా నిలిచింది మసాబా. 2020లో నటిగా కూడా మారిన మసాబా నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'మసాబా మసాబా'లో టైటిల్ రోల్ పోషించడమే కాకుండా, తన తల్లితో స్క్రీన్ పంచుకుంది.
మార్చి 12న తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా కొన్ని పాత ఫొటోలను షేర్ చేసింది మసాబా. మొదటి ఫొటో ఆమె చిన్నప్పటిది. అందులో తల్లి నీనా గుప్తా ఒడిలో పడుకొని ఉంది చిన్నారి మసాబా. పక్కనే ఆమె తండ్రి రిచర్డ్స్ కూర్చొని ఉన్నాడు. ఆ ఫొటోలో నీనా రెడ్ బోర్డర్ ఉన్న వైట్ శారీ, రెడ్ బ్లౌజ్, ఎర్రబొట్టు, వదిలేసిన జుట్టుతో స్టన్నింగ్ లుక్‌గా కనిపిస్తుండగా, రిచర్డ్స్ టీ షర్టు, షార్ట్స్ వేసుకొని ఉన్నారు. మరొకటి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్. అందులో ఒక దంపతుల జంట కనిపిస్తున్నారు. వాళ్లెవరో ఆమె చెప్పలేదు కానీ, వారు మసాబా అమ్మమ్మ తాతయ్యలుగా ఊహించవచ్చు. ఆ పిక్చర్స్‌కు, “My world. My blood.” అనే క్యాప్షన్ పెట్టింది మసాబా.
అప్పడప్పుడు కరీబియన్ దీవులకు వెళ్లి తండ్రిని కలిసి వస్తూ ఉంటుంది మసాబా. రిచర్డ్స్ భారత్‌కు వచ్చినప్పుడల్లా నీనా, మసాబాలతో గడిపి వెళ్తుంటారు.