English | Telugu
రేపు సాయంత్రం థియేటర్‌లో 'వకీల్ సాబ్' చూస్తున్నా!
Updated : Apr 8, 2021
పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' మూవీ కోసం ఫ్యాన్స్, సినీ ప్రియులు మాత్రమే కాదు, అన్నయ్య చిరంజీవి కూడా ఎంతో ఆత్రుతతో, ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. తన ఆత్రుతను బయటకు వ్యక్తీకరించకుండా ఆయన ఉండలేకపోయారు. గురువారం సాయంత్రం తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పవన్ కల్యాణ్‌తో కలిసున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. అది ఏదో మామూలు ఫొటో కాదు. కల్యాణ్‌కు చిరు స్వయంగా దువ్వెనతో జుట్టు సరిచేస్తున్న ఫొటో అది. ఆ అరుదైన ఫొటోను షేర్ చేసిన చిరంజీవి, "చాలా కాలం తరువాత పవన్ కల్యాణ్‌ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో #VakeelSaab చూస్తున్నాను. Can't wait to share my response of the film with you all. Stay tuned." అని ఆయన రాసుకొచ్చారు.
నిమిషాల వ్యవధిలోనే ఈ పోస్ట్‌కు వేలాది లైక్స్, రిట్వీట్స్ వచ్చాయి. చిరు షేర్ చేసిన ఫొటో వైరల్ అయ్యింది. వ్యక్తిత్వం, వ్యవహార శైలి రీత్యా చిరంజీవి, పవన్ కల్యాణ్ పరస్పరం చాలా భిన్నమని సన్నిహితులు చెబుతుంటారు. చిరంజీవిది స్వతహాగా మెతక స్వభావమైతే, కల్యాణ్‌ది దుడుకు స్వభావం. తన దుడుకు స్వభావంతో కల్యాణ్ పలు వివాదాల్లో చిక్కుకోవడం మనకు తెలుసు. అయితే కొంత కాలంగా ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చిందనేది నిజం.
2018 సంక్రాంతికి వచ్చిన 'అజ్ఞాతవాసి' మూవీ తర్వాత మూడేళ్ల విరామంతో 'వకీల్ సాబ్' సినిమాతో పవన్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో చిరంజీవి సైతం క్యూరియాసిటీతో ఉన్నారు. ట్రైలర్ తనకు బాగా నచ్చిందనీ, వకీల్ సాబ్ గెటప్‌లో కల్యాణ్ ఆకట్టుకున్నాడనీ ఇప్పటికే చెప్పిన మెగాస్టార్.. ఇప్పుడు ఆ సినిమాని తన ఫ్యామిలీతో రేపు సాయంత్రం చూస్తానని సోషల్ మీడియా సాక్షిగా వెల్లడించడంతో మెగా ఫ్యాన్స్ సంతోషానికి హద్దు లేకుండా పోయింది.