English | Telugu

శంక‌ర్‌.. హిందీ 'అప‌రిచితుడు' తీసే హ‌క్కు నీకు లేదు!

 

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కు హిందీలో 'అప‌రిచితుడు' (అన్నియ‌న్‌) సినిమాని రీమేక్ చేసే హ‌క్కు కానీ, అధికారం కానీ లేద‌ని దాని ఒరిజిన‌ల్ ప్రొడ్యూస‌ర్ ఆస్కార్ ర‌విచంద్ర‌న్ తెలిపారు. 'అప‌రిచితుడు' క‌థ హ‌క్కుల‌న్నీ త‌న‌కు మాత్ర‌మే సొంత‌మ‌నీ, ఆ హ‌క్కుల్ని తాను దివంగ‌త ర‌చ‌యిత సుజాత (రంగ‌రాజ‌న్‌) నుంచి కొనుగోలు చేశాన‌నీ ఆయ‌న తేల్చి చెప్పారు. త‌న‌కు మాట మాత్రం కూడా చెప్ప‌కుండా ఎలా హిందీలో ఆ సినిమాని రీమేక్ చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు, ఈ విష‌యంలో తాను చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కూడా తీసుకుంటాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

విక్ర‌మ్ హీరోగా శంక‌ర్ రూపొందించిన త‌మిళ చిత్రం 'అన్నియ‌న్' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. తెలుగులో ఒకేసారి 'అప‌రిచితుడు' పేరుతో విడుద‌లై ఇక్క‌డా కాసులు కురిపించింది. ఆ సినిమాని నిర్మించింది ఆస్కార్ ర‌విచంద్ర‌న్‌. అయితే ఇప్పుడు ర‌ణ‌వీర్‌సింగ్ హీరోగా హిందీలో ఆ మూవీని రీమేక్ చేయ‌నున్న‌ట్లు, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై జ‌యంతీలాల్ గ‌డా దాన్ని నిర్మించ‌నున్న‌ట్లు నిన్న శంక‌ర్ ప్ర‌క‌టించారు. 

దీంతో ఈరోజు శంక‌ర్‌కు ఓ లెట‌ర్‌తో పాటు లీగ‌ల్ నోటీస్ కూడా పంపారు ఆస్కార్ ర‌విచంద్ర‌న్‌. హిందీలో ఆ సినిమాని రీమేక్ చేయ‌నున్న‌ట్లు చేసిన ప్ర‌క‌ట‌న చూసి తాను తీవ్రంగా షాక‌య్యాన‌ని ఆయ‌న అన్నారు. ర‌చ‌యిత సుజాత నుంచి ఆ క‌థ హ‌క్కులు మొత్తం తాను కొనుగోలు చేశాన‌నీ, ఈ విష‌యంలో ఆయ‌న‌కు పూర్తిగా డ‌బ్బు చెల్లించాన‌నీ, దీనికి సంబంధించిన రికార్డుల‌న్నీ త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌నీ ర‌విచంద్ర‌న్ వెల్ల‌డించారు. ఆ స్టోరీలైన్ హ‌క్కుల‌కు తానే సంపూర్ణ య‌జ‌మానినని తెలిపారు. "నా ప‌ర్మిష‌న్ లేకుండా దాన్ని అడాప్ట్ చేసినా, రీమేక్ చేసినా, కాపీ చేసినా అది పూర్తిగా చ‌ట్ట‌విరుద్ధం." అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఆ లెట‌ర్‌లో 'బాయ్స్' సినిమా విష‌యాన్ని ర‌విచంద్ర‌న్ ప్ర‌స్తావించారు. "మీరు 'బాయ్స్' అనే అంత‌గా స‌క్సెస్‌ఫుల్ కాని సినిమా తీసి ఇమేజ్ దెబ్బ‌తిని, ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు, మీకు 'అన్నియ‌న్' (అప‌రిచితుడు) అనే సినిమాని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని నేను క‌ల్పించాను. కేవ‌లం నా స‌పోర్ట్ వ‌ల్లే మీరు పోయిన ఇమేజ్‌ను తెచ్చుకోగ‌లిగారు. ఆ విష‌యాన్ని మీరు క‌న్వీనియంట్‌గా విస్మ‌రించి, నా స‌క్సెస్‌ఫుల్ మూవీ 'అన్నియ‌న్‌'కు సంబంధించిన కీర్తి అంతా కొట్టేయాల‌ని ప్ర‌య‌త్నించి, దాన్ని హిందీలో రీమేక్ చేయ‌డానికి చూస్తుండ‌టం బాధాక‌రం. మీరెప్పుడూ కొన్ని నైతిక విలువ‌లు పాటించే వ్య‌క్తి అనుకొనేవాడ్ని. అలాంటిది ఇలాంటి అన్యాయ‌మైన ప‌నుల‌కు ఎందుకు పాల్ప‌డుతున్నార‌నేది నాకు ఆశ్చ‌ర్యంగా ఉంది." అని ఆ ఉత్త‌రంలో ఆయ‌న తెలిపారు.

'అన్నియ‌న్' క‌థ హ‌క్కుల‌న్నీ త‌న ద‌గ్గ‌రే ఉన్నందున వెంట‌నే హిందీ రీమేక్ ప‌నుల‌ను ఆపేయాల‌ని ఆయ‌న శంక‌ర్‌కు సూచించారు. లేదంటే తాను తీసుకొనే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధ‌ప‌డాల‌ని హెచ్చ‌రించారు. దీంతో 'అప‌రిచితుడు' హిందీ రీమేక్ వ్య‌వ‌హారం మ‌లుపు తీసుకుంది.