English | Telugu
సుత్తి వేలు రేర్ రికార్డ్.. ఒకే ఏడాది రెండు నంది అవార్డులు.. ఏ సంవత్సరమో తెలుసా!
Updated : Aug 7, 2023
దాదాపు 32 ఏళ్ళ పాటు వెండితెరపై నవ్వులు పంచిన వైనం.. దిగ్గజ హాస్య నటులు సుత్తి వేలు సొంతం. 1981లో విడుదలైన 'ముద్ద మందారం'తో మొదలుకుని 2013లో రిలీజైన 'రామాచారి' వరకు వేలు రకరకాల వేషాల్లో వినోదం పంచారు. మరీముఖ్యంగా.. హాస్య బ్రహ్మ జంధ్యాల తెరకెక్కించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ సుత్తి వేలు తనదైన హాస్యంతో గిలిగింతలు పెట్టారు. ఆరోగ్యకరమైన హాస్యంతోనే కాకుండా అడపాదడపా కరుణ రసంతో కూడిన పలు విభిన్న భూమికల్లోనూ ఆకట్టుకున్నారు సుత్తి వేలు.
అవార్డుల విషయానికి వస్తే.. తన కెరీర్ మొత్తమ్మీద నాలుగు సార్లు నంది పురస్కారాలు అందుకున్నారు సుత్తి వేలు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 1985లో ఏకంగా రెండు విభాగాల్లో నంది పురస్కారాలు కైవసం చేసుకుని అరుదైన రికార్డ్ సృష్టించారు. 'వందేమాతరం'కి గానూ 'ఉత్తమ సహాయనటుడు' విభాగంలోనూ, 'దేవాలయం'కిగానూ 'ఉత్తమ హాస్య నటుడు' కేటగిరిలోనూ నంది అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. విశేషమేమిటంటే.. ఈ రెండు చిత్రాలకు టి. కృష్ణ దర్శకుడు కాగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్ గా నటించారు. 1985 తరువాత 1989లో 'గీతాంజలి'కిగానూ, అలాగే 1990లో 'మాస్టారి కాపురం'కిగానూ మరో రెండు పర్యాయాలు 'ఉత్తమ హాస్యనటుడు' విభాగంలో నంది పురస్కారాలు పొందారు.
(ఆగస్టు 7.. సుత్తి వేలు జయంతి సందర్భంగా)