English | Telugu
శ్రీహరి 'సింహాచలం'కి 20 ఏళ్ళు.. 'కౌన్సిలింగ్ సీన్స్' మరచిపోవడం కష్టమే!
Updated : Aug 7, 2023
ఖాకీ పాత్రలకు చిరునామాగా నిలిచిన నటుల్లో రియల్ స్టార్ శ్రీహరి ఒకరు. తను కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా 'పోలీస్' (1999)తో మొదలుకుని పలు చిత్రాల్లో ఈ తరహా వేషాల్లో ఆకట్టుకున్నారాయన. 2003లో విడుదలైన 'సింహాచలం' కూడా ఈ జాబితాలోదే. ఇంద్రకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీహరికి జంటగా మీనా నటించగా ప్రకాశ్ రాజ్, సునీల్, వేణు మాధవ్, కోట శ్రీనివాసరావు, ఝాన్సీ, ఎల్బీ శ్రీరామ్, రాజా రవీంద్ర, హేమంత్ రావణ్, బండ్ల గణేశ్, నాగినీడు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. సురేశ్, కాంతారావు, రాళ్ళపల్లి, మల్లికార్జున రావు, నూతన్ ప్రసాద్, తెలంగాణ శకుంతల గౌరవనటులుగా దర్శనమిచ్చారు. పోసాని కృష్ణమురళి రచన చేశారు.
కథ విషయానికి వస్తే.. సింహాచలం (శ్రీహరి) నిజాయితీపరుడైన ఓ పోలీస్ అధికారి. తమ శాఖని కలుషితం చేస్తున్న కొందరు స్వార్థ, అవకాశ రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోరాడి.. జాతి సంక్షేమం కోసం ప్రాణాలకు కూడా తెగించి వ్యవస్థను ప్రక్షాళన చేస్తాడు. ఈ క్రమంలో తన భార్య (మీనా)ని కూడా కోల్పోతాడు. స్టోరీ లైన్ పరంగా కాస్త రొటీన్ గా అనిపించినా.. కథనంతో ఆసక్తికరంగా సాగే కాప్ సబ్జెక్ట్ ఇది. మరీ ముఖ్యంగా.. ఇందులోని 'కౌన్సిలింగ్ సీన్స్' గురించి ఇప్పటికీ చర్చించే వాళ్ళు లేకపోలేదు.
ఇక పాటల విషయానికి వస్తే.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరకల్పనలో రూపొందిన గీతాల్లో "దోబూచులాడే సిగ్గాటతో.. లాలూచిపడ్డా ముద్దాటకి..", "సోకేమో అదిరిపడి.. నాకేమో మనసుపడి", "నీతిని నమ్మితే ఓటమి ఉండునా" అలరిస్తాయి. వీటికి వేటూరి సుందరరామ్మూర్తి, సుద్దాల అశోక్ తేజ, శ్రీహర్ష సాహిత్యమందించారు. చంద్రహాసహ సినిమా పతాకంపై కానుమిల్లి శ్రీనివాసరావు నిర్మించిన 'సింహాచలం'.. 2003 ఆగస్టు 8న జనం ముందు నిలిచింది. మంగళవారంతో ఈ జనరంజక చిత్రం 20 ఏళ్ళు పూర్తిచేసుకుంటోంది.