English | Telugu

ఎన్టీఆర్, కృష్ణ మల్టిస్టారర్ 'దేవుడు చేసిన మనుషులు'కి 50 ఏళ్ళు.. దేశద్రోహులపై అన్నదమ్ముల పోరాటం!

తెలుగునాట పలు మల్టిస్టారర్స్ సందడి చేశాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించాయి. నటరత్న నందమూరి తారక రామారావు, నట శేఖర కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 'దేవుడు చేసిన మనుషులు' అచ్చంగా ఈ కోవకు చెందిన సినిమానే. ఆచారాలను అవకాశంగా తీసుకుని దేశసంపదను విదేశాలకు చేరవేసి కోట్లు సంపాదించాలని చూసే స్వార్థపరుల నుండి జాతి అమూల్యరత్నాలైన శిల్పాలను కాపాడడం కోసం రంగంలోకి దిగిన రాము, గోపీ అనే అన్నదమ్ముల కథే.. 'దేవుడు చేసిన మనుషులు'. 

పద్మాలయా స్టూడియోస్ పతాకంపై జి. హనుమంతరావు ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా కథను కూడా అందించడం విశేషం. ప్రముఖ దర్శకుడు వి. రామచంద్రరావు స్క్రీన్ ప్లే సమకూర్చి మరీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రిపురనేని మహారథి అందించిన సంభాషణలు ఓ ఎస్సెట్ గా నిలిచాయి. 

ఎన్టీఆర్, కృష్ణతో పాటు ఎస్వీఆర్, జయలలిత, విజయ నిర్మల, కాంచన, కాంతారావు, జగ్గయ్య (ద్విపాత్రాభినయం), కైకాల సత్యనారాయణ, ఎస్. వరలక్ష్మి, నిర్మలమ్మ, సాక్షిరంగారావు, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, కేవీ చలం, మమత ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. జమున, మంజుల ఓ పాట కోసం అతిథి పాత్రల్లో మెరిశారు.

రమేశ్ నాయుడు సంగీతమందించిన 'దేవుడు చేసిన మనుషులు'కి శ్రీ శ్రీ, దాశరథి, ఆరుద్ర సాహిత్యమందించారు. "దేవుడు చేసిన మనుషుల్లారా" (రెండు వెర్షన్స్), "మసక మసక చీకటిలో", "దోరవయసు చిన్నది", "తొలిసారి నిన్ను", "నీ దగ్గర ఏదో ఉన్నది", "విన్నారా అలనాటి వేణు గానం".. ఇలా ఇందులోని గీతాలన్ని విశేషాదరణ పొందాయి. 1973 ఆగస్టు 9న విడుదలై ఆ యేటి మేటి విజయవంతమైన చిత్రంగా నిలిచిన 'దేవుడు చేసిన మనుషులు'.. హిందీలో 'టక్కర్' (1980) పేరుతో రీమేక్ అయింది.  బుధవారంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీ 50 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.