English | Telugu
సుమంత్ అశ్విన్ పెళ్లయిపోయింది!
Updated : Feb 13, 2021
ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు కుమారుడు హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటి వాడయ్యాడు. కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ శివార్లలోని ఎం.ఎస్. రాజు ఫామ్‌హౌస్‌లో సందడిగా జరిగిన పెళ్లి వేడుకలో దీపిక మెడలో మూడు ముళ్లు వేశాడు. దీపిక డల్లాస్‌లో రీసెర్చి సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె స్వస్థలం హైదరాబాదే. ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయినప్పటికీ కన్నుల పండువగా తన కుమారుడి వివాహ వేడుకను జరిపించారు ఎమ్మెస్ రాజు. సుమంత్ సంప్రదాయ ధవళ వర్ణం ధోతీ, చొక్కా ధరించగా, దీపిక ఎరుపు రంగు పట్టుచీర, నడుముకు వడ్డాణం ధరించారు.
ఈ రోజు గోరింటాకు వేడుకతో పెళ్లి సందడి మొదలైంది. సుమంత్ అశ్విన్, దీపిక జంటగా కూర్చొని, గోరింటాకు పెట్టుకున్న తమ చేతులను చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. దీపిక అయితే మెహందీ వేసుకున్న తన కాళ్లను కూడా ప్రదర్శించారు. అలాగే తండ్రితో కలిసి మరో ఫొటోకు ఆనందంగా నవ్వుతూ పోజు ఇచ్చాడు సుమంత్.
ప్రస్తుతం సుమంత్ అశ్విన్ 'ఇదే మా కథ' అనే బైక్ జర్నీ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రధారులు. మరోవైపు 'డర్టీ హరి' సినిమా సక్సెస్‌తో డైరెక్టర్‌గా ఎం.ఎస్. రాము హ్యాపీ మోడ్‌లో ఉన్నారు. కుమారుడి పేరుమీదే సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ను నెలకొల్పిన ఎమ్మెస్ రాజు, దానిపై పలు బ్లాక్‌బస్టర్ మూవీస్‌ను నిర్మించారు.