English | Telugu
నాగార్జున కంటే ఏఎన్నార్ ఎక్కువ రొమాంటిక్.. తేల్చేసిన సుమంత్!
Updated : Feb 9, 2021
మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తుంటాయంటారు. అయితే తనకు తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు పోలికలు వచ్చాయని సుమంత్ చెబుతుంటారు. తండ్రీకొడుకులు ఏఎన్నార్, నాగార్జున.. ఇద్దరూ రొమాంటిక్ హీరోలుగా పేరుపొందారు. నిజ జీవితంలోనూ వారిలో ఆ యాంగిల్ ఉంటుందనేది సాధారణంగా వినిపించే విషయమే. అయితే ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రొమాంటిక్? ఈ ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో సుమంత్‌కు ఎదురైంది. కన్న తల్లిదండ్రుల కంటే తాతయ్య ఏఎన్నార్‌తోటే ఆయనకు ఎక్కువ అనుబంధం.
"నేను డిప్లోమాటిగ్గా ఆన్సర్ చెయ్యను. ఇద్దరిలో తాతే ఎక్కువ రొమాంటిక్. అది నేను చూశాను. అయ్యబాబోయ్.. చెప్పడానికి బాధేస్తుంది కానీ.. ఆఖరి దశలో ఆయనను చూసుకోవడానికి ఇద్దరు నర్సులు ఉండేవాళ్లు. చనిపోయే దశలో కూడా వాళ్లతో ఎంతగా చిలిపిగా ఉండేవారో! ఆయన దగ్గరకు వెళ్లి కూర్చున్నప్పుడు నాకు బాధేసేది. ఎందుకంటే నేను చివరిదాకా ఆయనతో, ఆయన పక్కనే ఉన్నాను. ఆ నర్సులతో తాతయ్య బిహేవియర్ చూసి, నేను మురిసిపోయేవాడ్ని. కన్నీళ్లు పోయి నా ముఖంలో చిరునవ్వు వచ్చేది." అని చెప్పుకొచ్చారు సుమంత్.
చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన తొలి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాలని సంకల్పించినప్పుడు పసివాడైన సుమంత్ తోటే శంకుస్థాపన చేయించారు ఏఎన్నార్. ఆ మనవడిని దత్తత తీసుకున్నారు. అలా పసితనంలోనే తాతయ్య దగ్గర పెరిగారు సుమంత్. చివరి క్షణాల దాకా ఆయనతోనే ఉన్నారు. 2014 జనవరి 22న కేన్సర్‌తో బాధపడుతూ అక్కినేని తుదిశ్వాస విడిచారు. ఆయన లేని లోటు సుమంత్‌కు ఎవరూ పూడ్చలేరనేది సన్నిహితులు చెప్పే మాట. ఈరోజు సుమంత్ బర్త్‌డే.