English | Telugu
'సలార్'తో 2022 సమ్మర్ సీజన్‌పై కర్చీఫ్ వేసిన ప్రభాస్!
Updated : Feb 28, 2021
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న 'సలార్' మూవీ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదలవనుంది. అంటే 2022 సమ్మర్‌ను చాలా ముందుగానే సలార్ బుక్ చేసేసుకుందన్న మాట! శ్రుతి హాసన్ తొలిసారి ప్రభాస్ జోడీగా నటిస్తోన్న ఈ మూవీని హోంబళే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు.
ఆదివారం మధ్యాహ్నం 3:25 గంటలకు 'సలార్' రిలీజ్ డేట్‌ను మేకర్స్‌తో పాటు ప్రభాస్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించాడు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేసిన ప్రభాస్, "సలార్ రిలీజ్ డేట్‌ను షేర్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. 2022 ఏప్రిల్ 14న సినిమా హాళ్లలో మిమ్మల్ని చూస్తాను." అని క్యాప్షన్ పెట్టాడు. #Salaar14Apr22 అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు. పోస్టర్‌లో బ్లాక్ కలర్ నెక్ టీ షర్ట్, బ్లాక్ జీన్స్‌తో కళ్లకు బ్లాక్ గాగుల్స్‌తో రెబల్‌గా నడుచుకుంటూ వస్తున్నాడు ప్రభాస్. పోస్టర్‌పై "రెబలింగ్ వరల్డ్‌వైడ్ ఫ్రమ్ ఏప్రిల్ 14, 2022" అని రాశారు. ఆరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి కావడం గమనార్హం.
'సలార్'లో ప్రభాస్ ముంబైకి చెందిన ఓ గ్యాంగ్ లీడర్‌గా కనిపించనున్నాడు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం 'కేజీఎఫ్ చాప్టర్ 2' పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తవగానే 'సలార్' షూటింగ్‌ను కొనసాగించనున్నాడు. మరోవైపు ప్రభాస్ కూడా 'రాధేశ్యామ్' సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఏడాది జూలై 30న ఆ సినిమా రిలీజవుతోంది.