English | Telugu
సంజనతో బుమ్రా పెళ్లయిపోయింది!
Updated : Mar 16, 2021
ఇండియన్ టాప్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సోమవారం రాత్రి స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజనా గణేశన్‌ను పెళ్లి చేసుకున్నాడు. గోవాలో జరిగిన ఈ ప్రైవేట్ ఫంక్షన్‌లో కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కొంతకాలంగా, బుమ్రా పెళ్లి వ్యవహారం వార్తల్లో నలుగుతూ వస్తోంది. ఇదివరకు టాలీవుడ్ హీరోయిన్, కేరళ కుట్టి అయిన అనుపమ పరమేశ్వరన్‌తో అతను డేటింగ్ చేస్తున్నాడనీ, త్వరలో ఆ ఇద్దరూ పెళ్లాడనున్నారనీ ప్రచారంలోకి వచ్చింది. ఆ ప్రచారాన్ని అనుపమ తల్లి ఖండించారు.
ఆ తర్వాత బుమ్రా పెళ్లాడబోతోంది సంజనా గణేశన్‌ను అనే విషయం వెల్లడైంది. అయితే ఇరువురి కుటుంబాలూ ఈ పెళ్లి గురించి ఏమీ మాట్లాడలేదు. ఎట్టకేలకు మార్చి 15న కేవలం 20 మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య బుమ్రా, సంజన పెళ్లి జరిగింది. అతిథులు తమ సెల్‌ఫోన్లను బయటనే పెట్టి వేదిక వద్దకు వచ్చారు. పూర్తిగా ప్రైవేట్ వేడుకగా ఈ వివాహం జరగడం గమనార్హం.
మార్చి 15న తన వెడ్డింగ్ ఫొటోలను షేర్ చేయడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచాడు బుమ్రా. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రెండు పెళ్లి ఫొటోలను అతను షేర్ చేశాడు. ఆ పిక్చర్స్‌లో పెళ్లి వేదిక అంతా పింక్‌మయంగా కనిపిస్తోంది. వధూవరులిద్దరూ కూడా మ్యాచింగ్ పింక్ డ్రస్‌లు ధరించారు. బుమ్రా పింక్ షేర్వాణీ, దానికి మ్యాచ్ అయ్యే టర్బన్ ధరించగా, సంజనా పింక్ కలర్ లెహంగా, పూల ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌తో మెరిసిపోతోంది. మెడలో నెక్లెస్ నుంచి ఆమె ధరించిన ఆభరణాలన్నీ కూడా మ్యాచింగ్ కలర్‌లోనే ఉండటం విశేషం.
బుమ్రా, సంజనా ఇద్దరూ ఒకే ఫొటోలను షేర్ చేసి “Love, if it finds you worthy, directs your course. ప్రేమతో నడిచే ఓ కొత్త ప్రయాణాన్ని మేం కలిసి ప్రారంభించాం. ఈరోజు మా జీవితాల్లోని అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఒకటి. మా పెళ్లి వార్తను, మా ఆనందాన్ని మీతో పంచుకోగలగడం ఆశీర్వాదంగా మేం ఫీలవుతున్నాం. జస్‌ప్రీత్ అండ్ సంజనా." అంటూ రాసుకొచ్చారు.
స్టార్ స్పోర్ట్స్‌లో పనిచేస్తోన్న సంజనా గణేశన్.. ఐపీఎల్, బ్యాడ్మింటన్ టోర్నీలు సహా పలు ఈవెంట్లకు టీవీ ప్రెజెంటర్‌గా వ్యవహరించింది.