English | Telugu

గోపీచంద్ 'సీటీమార్' టీజ‌ర్ రివ్యూ

 

"క‌బ‌డ్డీ.. మైదానంలో ఆడితే ఆట‌.. బ‌య‌ట ఆడితే వేట" అంటూ త‌న క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుందో చెప్పేశాడు గోపీచంద్‌. ఆయ‌న హీరోగా సంప‌త్ నంది డైరెక్ట్ చేస్తున్న యాక్ష‌న్ డ్రామా 'సీటీమార్' టీజ‌ర్ వ‌చ్చేసింది. సోమ‌వారం ఉద‌యం ఒక నిమిషం 10 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఆస‌క్తి పెరిగింద‌నేది నిజం. 

సాధార‌ణంగా టీజ‌ర్‌లో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ లేదా సినిమా థీమ్‌ను మాత్ర‌మే చెప్తుంటారు. కానీ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది సినిమా ఎలా ఉంటుందో ఈ చిన్న టీజ‌ర్‌లోనూ చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. దాదాపు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌నంద‌ర్నీ ప‌రిచ‌యం చేసేశాడు. క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో హీరోకూ, విల‌న్‌కూ మ‌ధ్య దేనికోస‌మో పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతుంద‌ని ఈ టీజ‌ర్ ద్వారా అర్థ‌మ‌వుతోంది. దానికీ, క‌బ‌డ్డీ ఆట‌కూ సంబంధం ఉంద‌ని ఊహించ‌వ‌చ్చు. 

ఈ మూవీలో గోపీచంద్ పేరు కార్తీ. అయితే రావు ర‌మేశ్, "రేయ్ కార్తీ" అని పెద్ద‌గా కేక‌వేశాక‌, "న‌న్నెవ‌డైనా అలా పిల‌వాలంటే.. ఒక‌టి నా ఇంట్లోవాళ్లు పిల‌వాలి, లేదా నా ప‌క్క‌నున్న ఫ్రెండ్స్ పిల‌వాలి. ఎవ‌డు ప‌డితే వాడు పిలిస్తే.. వాడి కూత ఆగిపోద్ది." అంటూ ఆయ‌న పంపిన రౌడీల‌ను చిత‌క్కొట్టాడు గోపీచంద్‌. ఇందులో అత‌ను క‌బ‌డ్డీ కోచ్‌గా న‌టిస్తున్నాడు. లేడీస్ టీమ్ క‌బ‌డ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌ను త‌మ‌న్నా పోషిస్తుండ‌గా, బ్యూటిఫుల్ దిగంగ‌నా సూర్య‌వంశీ ఆస‌క్తిక‌ర‌మైన సెకండ్ హీరోయిన్ రోల్ ప్లే చేస్తోంది. 

భూమికా చావ్లా, రెహ‌మాన్ (ర‌ఘు) కూడా ఈ టీజ‌ర్‌లో క‌నిపించారు. వారివి కీల‌క‌మైన పాత్ర‌లుగా తెలుస్తోంది. త‌రుణ్ అరోరా, రోహిత్ పాఠ‌క్ విల‌న్లుగా గోపీని ఢీకొడుతున్నారు. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, మ‌ణిశ‌ర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో టీజ‌ర్ రిచ్ లుక్‌తో క‌నిపిస్తోంది. ఏప్రిల్ 2న సీటీమార్‌ను రిలీజ్ చేయ‌డానికి శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ అధినేత‌ శ్రీ‌నివాస చిట్టూరి స‌న్నాహాలు చేస్తున్నారు.