English | Telugu
బాలయ్య 'అఖండ' రూపం!
Updated : Apr 13, 2021
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను రూపొందిస్తోన్న చిత్రానికి 'అఖండ' అనే టైటిల్ ప్రకటించారు. శ్రీ ప్లవ నామ సంవత్సర ఆరంభం రోజున ఓ టీజర్ ద్వారా ఈ సినిమా మేకర్స్ అఖండ టైటిల్‌తో పాటు బాలకృష్ణ పోషిస్తోన్న అఘోర క్యారెక్టర్‌ను సైతం రివీల్ చేశారు. "BB3 టైటిల్ రోర్" పేరుతో రిలీజ్ చేసిన ఈ టీజర్‌లో "హరహర మహాదేవ్ శంభోశంకర" అంటూ అఖండ రూపంతో తెరపై ప్రత్యక్షమైన బాలయ్య, "కాలుదువ్వే నంది ముందు రంగుమార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది." అంటూ చేతిలోని త్రిశూలాన్ని నేలకేసి బలంగా కొట్టి, తనపైకి వచ్చిన దుండగుల్ని దునుమాడి, "ఆ.." అని నోరుతెరచి భీకరంగా గర్జించడం ఒళ్లు గగుర్పాటు కలిగించేలా ఉంది.
నల్లటి దుస్తులు, భుజాల పైన ఎర్రటి వస్త్రం, మెడలో పలు రుద్రాక్ష మాలలు, నుదుటిన శివనామం, చేతిలో త్రిశూలంతో బాలకృష్ణ రూపం అత్యంత పవర్‌ఫుల్‌గా చూడగానే ఆకట్టుకుంటోంది. 'అఖండ' టైటిల్ రోర్ టీజర్‌కు ఎప్పట్లా తమన్ తన సూపర్బ్ బీజియంతో ప్రాణం పోశాడు. సీనియర్ సినిమాటోగ్రాఫర్ రామ్‌ప్రసాద్ కెమెరా పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.
ఇదివరకు ప్రేక్షకులకు 'సింహా'గా, 'లెజెండ్'గా బాలయ్యను పరిచయం చేసి, అద్భుత విజయాలు సాధించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఇప్పుడు ఆయనను 'అఖండ'గా మరింత పవర్‌ఫుల్ రోల్‌లో ప్రెజెంట్ చేస్తున్నాడని అర్థమైపోతోంది. 'లెజెండ్' మూవీ తర్వాత ఆ స్థాయి విజయం కోసం ఎదురుచూస్తున్న బాలకృష్ణకు 'అఖండ' ఆ కోరిక తీరుస్తుందనే నమ్మకం కలిగిస్తోంది.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తోన్న 'అఖండ' మూవీలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్. కెరీర్ మొదట్లో నెగటివ్ రోల్స్ చేశాక ఇప్పుడు మెయిన్ విలన్‌గా ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు శ్రీకాంత్. వాస్తవానికి ఎన్టీఆర్ జయంతి అయిన మే 28న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు ఇదివరకు నిర్మాతలు ప్రకటించారు. టీజర్‌లో రిలీజ్ డేట్ కనిపించలేదు. కరోనా మహమ్మారి ఉధృత వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని విడుదల తేదీని పెండింగ్‌లో పెట్టినట్లు అర్థమవుతోంది.