English | Telugu
మురళీ మోహన్, గిరిబాబు తొలి చిత్రం 'జగమే మాయ'కి 50 ఏళ్ళు.. 'ఎ' సర్టిఫికేట్ తో రిలీజైన మూవీ!
Updated : Jul 27, 2023
తెలుగునాట నటులుగా తమదైన ముద్రవేసిన మురళీ మోహన్, గిరిబాబు.. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం ఒకే సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. బాలీవుడ్ హారర్ మూవీ 'దో గజ్ జమీన్ కే నీచే' (1972) ఆధారంగా రూపొందిన ఆ చిత్రమే.. 'జగమే మాయ'. ఐ.ఎన్. మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి గొల్లపూడి రచన చేయగా.. నవోదయ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై పి.వి. సుబ్బారావు నిర్మించారు. 'పెద్దలకు మాత్రమే' అంటూ 'ఎ' సర్టిఫికేట్ తో జనం ముందు నిలిచిన 'జగమే మాయ'లో సునందిని, కె. విజయ కథానాయికలుగా నటించారు. వారిద్దరికి కూడా ఇదే మొదటి సినిమా కావడం విశేషం. విజయలలిత, రాజబాబు, నాగయ్య ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
'జగమే మాయ'కి ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం అందించిన బాణీలు ప్రధాన బలంగా నిలిచాయి. "నీ మదిలో నేనే ఉంటే.." (ఎస్పీ బాలు, సుజాత గానం.. సి. నారాయణరెడ్డి సాహిత్యం), "జగమే మాయ బ్రతుకే మాయ" (ఎస్పీ బాలు గానం.. కొసరాజు సాహిత్యం), "ఈ జ్వాల ఆరేది కాదు ఈ బాధ తీరేది కాదు" (జానకి గానం.. సి. నారాయణ రెడ్డి సాహిత్యం), "మూగతనం వదులుకో దొరబాబు.. బేలతనం వదులుకో చినబాబు" (జానకి గానం.. సి. నారాయణరెడ్డి సాహిత్యం) అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకుంటాయి. 1973 జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జగమే మాయ'.. ఓ వర్గం ప్రేక్షకులను అలరించింది.