English | Telugu

ఎన్టీఆర్ 'రాజపుత్ర రహస్యం'కి 45 ఏళ్ళు!


జానపద చిత్రాలకు చిరునామాగా నిలిచిన కథానాయకుల్లో నటరత్న నందమూరి తారక రామారావు ఒకరు. ఆయన నటించిన పలు జానపద చిత్రాలు తెలుగు ప్రజల్ని రంజింపజేశాయి. వాటిలో 'రాజపుత్ర రహస్యం' ఒకటి. అందాల తార జయప్రద కథానాయికగా నటించిన ఈ సినిమాని ఎస్.డి. లాల్ తెరకెక్కించారు. జమున, కాంచన, సత్యనారాయణ, ఎం. బాలయ్య, మోహన్ బాబు, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, మల్లాది, చలపతి రావు, జగ్గారావు, పుష్పలత, జయమాలిని, హలం ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వగా.. పద్మా ఖన్నా ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది. గొల్లపూడి సంభాషణలు సమకూర్చారు.

స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి, సి. నారాయణ రెడ్డి సాహిత్యమందించారు. "సిరిమల్లె పువ్వు మీద" (ఎస్పీబీ, సుశీల), "సాన్నాళ్ళకొచ్చాడు" (ఎస్. జానకి), "ఎంత సరసుడు" (బాలు, సుశీల), "ఓపలేని తీపి" (సుశీల), "దిక్కులెన్ని దాటాడో" (సుశీల, జానకి).. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. జయలక్ష్మి మూవీస్ పతాకంపై యార్లగడ్డ లక్ష్మయ్య చౌదరి నిర్మించిన 'రాజపుత్ర రహస్యం'.. 1978 జూలై 28న జనం ముందు నిలిచింది. శుక్రవారంతో ఈ చిత్రం 45 వసంతాలు పూర్తిచేసుకుంది.