English | Telugu

కృష్ణ 'రామరాజ్యంలో భీమరాజు'కి 40 ఏళ్ళు.. 'శ్రీమంతుడు'కి బాబు లాంటి సినిమా!


 

సూపర్ స్టార్ కృష్ణ గ్రామీణ నేపథ్యంలో నటించిన పలు చిత్రాలు విజయపథంలో పయనించాయి. వాటిలో 'రామరాజ్యంలో భీమరాజు' ఒకటి. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో కృష్ణకి జంటగా అతిలోక సుందరి శ్రీదేవి నటించగా.. రావుగోపాల రావు, సత్యనారాయణ, జగ్గయ్య, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, సంగీత, నిర్మలమ్మ, వడివుక్కరసి, చంద్రిక, చలపతిరావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఈ చిత్రానికి వసుంధర కథను అందించగా.. సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు.

కథాంశం విషయానికి వస్తే.. కోట్లకు అధికారి అయిన రఘుపతి రాజు (జగ్గయ్య)కి ఒక్కగానొక్క కొడుకు కృష్ణ రాజ్ కుమార్ (కృష్ణ). "మనిషి బ్రతుకుకి డబ్బొక్కటే అవసరమైనది కాదు.. దానికి మించి మంచితనం, మానవత్వం ముఖ్యం" అని నమ్మే వ్యక్తి కృష్ణ. అయితే, రఘుపతి రాజు ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. ఒకానొక సందర్భంలో.. తండ్రీకొడుకుల మధ్య ఈ విషయంపై వాదన వస్తుంది. తన పేరు, డబ్బు వినియోగించకుండా బ్రతకమంటాడు రఘుపతి రాజు. సరేనంటూ ఇంటి నుంచి బయటికొస్తాడు కృష్ణ. ఈ క్రమంలోనే లంకా నగరం అనే ఊరులోకి భీమరాజుగా అడుగుపెడతాడు. అక్కడ రామరాజు (రావు గోపాల రావు) అన్యాయాలను ఎదురిస్తాడు. మరోవైపు.. జ్యోతి (శ్రీదేవి) కుటుంబానికి చేరువవుతాడు. ఆ ఇంటి సమస్యలు తీరుస్తాడు. తండ్రితో వేసిన పందెంలోనూ నెగ్గుతాడు. కృష్ణ, జ్యోతి ఒక్కటవడంతో సినిమా సుఖాంతమవుతుంది. 'రామరాజ్యంలో భీమరాజు'ని పరిశీలనగా చూస్తే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు 'శ్రీమంతుడు'కి ఒక రకంగా ఈ సినిమా కూడా స్ఫూర్తి అనిపించకమానదు.  

ఇక పాటల విషయానికి వస్తే.. చక్రవర్తి సంగీతమందించిన 'రామరాజ్యంలో భీమరాజు'కి వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. "కథ చెబుతాను ఊ కొడతారా ఉలిక్కి పడతారా", "కాబోయే శ్రీమతి", "తటపట తడిసిన కోక", "ఏనాడో నీకు నాకు", "చూపుతోనే చూడకుండా".. అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకుంటాయి. ఈ గీతాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఎస్పీ శైలజ గానం చేశారు. శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దే రామారావు నిర్మించిన 'రామరాజ్యంలో భీమరాజు'.. 1983 జూలై 28న విడుదలై ప్రజాదరణ పొందింది. శుక్రవారంతో ఈ సూపర్ హిట్ మూవీ 40 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.