English | Telugu
'సిద్ధు ఫ్రమ్ సికాకుళం'కి 15 ఏళ్ళు.. అల్లరోడి సరదా ప్రేమకథ!
Updated : Aug 14, 2023
హాస్యభరిత చిత్రాలకు పెట్టింది పేరు.. అల్లరి నరేశ్. కామెడీ హీరోగా తను నటించిన పలు సినిమాలు ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టాయి. వాటిలో 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం' ఒకటి. ఈశ్వర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే మంజరి, శ్రద్ధా దాస్ తెలుగునాట కథానాయికలుగా తొలి అడుగేశారు. జయ ప్రకాశ్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఎల్బీ శ్రీరామ్, సురేఖా వాణి, తెలంగాణ శకుంతల, సత్యం రాజేశ్, కృష్ణ భగవాన్, మాస్టర్ భరత్ ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
కథాంశం విషయానికి వస్తే.. శ్రీకాకుళంకి చెందిన సిద్ధు వైజాగ్ కి చెందిన ఓ కళాశాలలో చేరతాడు. అక్కడే శైలజ (మంజరి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. శైలు కూడా అతని ప్రేమని అంగీకరిస్తుంది. అయితే, తన తండ్రి ఓబుల్ రెడ్డి (జయ ప్రకాశ్ రెడ్డి) ఓ పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని.. భూమారెడ్డి తమ్ముడితో ఆల్రెడీ పెళ్ళి కూడా ఫిక్స్ చేశాడని చెబుతుంది. ఈ నేపథ్యంలో.. సిద్ధు తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు? ఓబుల్ రెడ్డి అనుమతితోనే శైలజని ఎలా పెళ్ళి చేసుకున్నాడు? అనేది మిగిలిన సినిమా.
పాటల విషయానికి వస్తే.. కె.ఎం. రాధాకృష్ణన్ సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి, వనమాలి, భూపాల్, పెద్దాడమూర్తి, సాయిశ్రీహర్ష సాహిత్యమందించారు. ఇందులోని "తెల్లారిపోనీకు ఈ రేయిని" గీతం మెలోడీప్రియులను విశేషంగా అలరించగా.. "జాంపండు లాంటి పిల్ల", "సరసాంగి రతనాంగి", "ఓ క్షణమైనా చాలు", "నా నబబా నననా" పాటలు కూడా ఆకట్టుకున్నాయి. వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై మళ్ళ విజయ ప్రసాద్ నిర్మించిన 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం' 2008 ఆగస్టు 14న జనం ముందు నిలిచింది. నేటితో ఈ చిత్రం 15 వసంతాలు పూర్తిచేసుకుంది.