English | Telugu

అమీషా ప‌టేల్‌కు సంబంధించిన ఈ నిజాలు తెలిస్తే షాక‌వుతారు!

అందాల తార అమీషా ప‌టేల్ నేడు 45వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటోంది. స‌రిగ్గా 2000 సంవ‌త్స‌రంలో బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ 'క‌హో నా ప్యార్ హై'లో హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న న‌టించ‌డం ద్వారా సినిమా ప్ర‌పంచంలోకి అడుగుపెట్టింది అమీషా. అదే సంవ‌త్స‌రం ప‌వ‌న్ క‌ల్యాణ్ జోడీగా న‌టించిన 'బ‌ద్రి' మూవీతో టాలీవుడ్‌కూ ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత 'నాని', 'న‌ర‌సింహుడు', 'ప‌ర‌మ‌వీర‌చ‌క్ర' సినిమాల్లో వ‌రుస‌గా మ‌హేశ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌టించింది. బాలీవుడ్‌లో 'గ‌ద‌ర్‌: ఏక్ ప్రేమ్‌క‌థ‌', 'హ‌మ్‌రాజ్‌', 'మంగ‌ళ్ పాండే', 'రేస్ 2' లాంటి హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. కొంత‌కాలంగా ఆమె సినిమాల్లో క‌నిపించ‌డం లేదు కానీ, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న త‌న స్ట‌న్నింగ్ పిక్చ‌ర్స్‌తో ఫ్యాన్స్‌ను అల‌రిస్తూనే ఉంది.

ఆమె తండ్రి పేరు అమిత్‌, త‌ల్లి పేరు ఆషా. త‌మ ఇద్ద‌రి పేర్లు క‌లిసేలా కూతురికి అమీషా అనే పేరు పెట్టుకున్నారు. వాళ్ల‌ది ముంబైలో స్థిర‌ప‌డిన గుజ‌రాతీ ఫ్యామిలీ. 1975 జూన్ 9న అమీషా పుట్టింది. యు.ఎస్‌.లోని ట‌ఫ్ట్స్ యూనివ‌ర్సిటీలో ఎక‌నామిక్స్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసింది. ముంబైకి తిరిగొచ్చాక‌, సినిమాల్లో న‌టించ‌డం ప్రారంభించింది.

సొంత త‌ల్లిదండ్రుల‌తో అమీషా గొడ‌వ‌లుప‌డ్డం ర‌చ్చ‌కెక్కింది. త‌ను సంపాదించే డ‌బ్బును పాడుచేస్తోందంటూ ఆరోపించ‌డం ద్వారా ఆమె త‌ల్లిదండ్రులు సంచ‌ల‌నం సృష్టించారు. దాంతో త‌న సంపాద‌న రూ. 12 కోట్ల‌ను త‌న‌కు తిరిగి ఇవ్వాలంటూ వాళ్ల‌కు లీగ‌ల్ నోటీస్ పంపింది అమీషా. ఇది మ‌రింత సెన్సేష‌న‌ల్ న్యూస్ అయ్యింది.

ఒక‌సారి అమీషాను ఆమె త‌ల్లి చెప్పుతో కొట్టి, ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్టిందంటూ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. నిర్మాత‌-ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ భ‌ట్‌తో కూతురు ఎఫైర్ పెట్టుకుంద‌నే కోపంతోనే త‌ల్లి ఆ ప‌నిచేసిందంటారు.

సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేసిన అమీతా 'దేశీ మ్యాజిక్' అనే మూవీని నిర్మించింది. అదింకా విడుద‌ల కాలేదు.