English | Telugu

'సీత' పాత్ర‌కు క‌రీనా రూ. 12 కోట్లు డిమాండ్.. ఆమెను బాయ్‌కాట్ చేయాలంటున్న నెటిజ‌న్స్‌!

బాలీవుడ్‌లో బాగా ప్రాచుర్యం పొందిన సెల‌బ్రిటీల‌లో కరీనా కపూర్ ఖాన్ (బెబో) ఒకరు. రాబోయే ప్రాజెక్టులు, సోషల్ మీడియా పోస్టుల కారణంగా ఎప్పుడూ ఆమె వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడామె ఒక వివాదంలో చిక్కుకుంది. రాబోయే పౌరాణిక చిత్రం 'సీత' కోసం ఆమె 12 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో కోపంతో ఉన్న నెటిజన్లు "బాయ్‌కాట్ క‌రీనా ఖాన్" అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. అవును, మీరు చ‌దివింది క‌రెక్టే!

సోష‌ల్ మీడియాలో క‌రీనాపై జ‌నం వ్య‌క్తం చేస్తున్న ఆగ్రహం వరదలా పొంగి పొర్లుతోంది. బెబో తమ మత మనోభావాలను దెబ్బతీస్తోంద‌నీ, ఒక పాత్ర కోసం పన్నెండు కోట్లు డిమాండ్ చేయ‌డం చాలా అతిగా ఉందనీ, ఇది మానవత్వానికి వ్యతిరేకం అనీ నెటిజన్లు ఆరోపించారు. కొంతమంది ట్విట్టర్ యూజర్లు కరీనా కపూర్ ఖాన్‌ను సీత పాత్ర‌కోసం తీసుకోవాల‌ని ఆలోచిస్తున్నందుకు ఈ చిత్ర దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక ట్విట్టర్ యూజర్ "బాలీవుడ్ మే క్యా యాక్ట్రెస్‌ ఖతం హొగయే హై" అని రాశారు. మరో ట్విట్టర్ యూజర్ "# బాయ్‌కాట్ కరీనా దీనికి అర్హత లేదు." అని రాయ‌గా, మూడవ యూజర్ "సీత పాత్రకు కరీనా కపూర్ ఖాన్ భారీ మొత్తాన్ని వసూలు చేయ‌నుంది... #BoycottKareenaKhan . అలాగే సీతా మాత‌ పాత్ర కోసం ఆమెను తీసుకోవాల‌ని చూస్తున్న ప్రొడ్యూస‌ర్‌ని, డైరెక్ట‌ర్‌ని కూడా మ‌నం బాయ్‌కాట్ చేయాలి. వేరే మతానికి చెందిన‌వాళ్లు ఇలాంటి పాత్రలు ఎందుకు పోషించాలి!!" అని రాసుకొచ్చారు.

వి. విజయేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌, స్క్రీన్‌ప్లే స‌మ‌కూరుస్తున్న 'సీత' చిత్రానికి అలౌకిక్ దేశాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రూపొంద‌నున్న ఈ సినిమాలో రావ‌ణునిగా పాత్ర‌కు ఇప్ప‌టికే ర‌ణ‌వీర్ సింగ్‌ను సంప్ర‌దించారు కానీ ఇంకా అత‌ని నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు.

కరీనా కపూర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్ఢా' సినిమాలో న‌టిస్తోంది. ఆ మూవీలో ఆమె ఆమిర‌ ఖాన్‌తో స్క్రీన్ పంచుకుంటోంది. ఇప్ప‌టికే ఆమె ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసింది. టామ్ హాంక్స్‌, రాబిన్ రైట్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన హాలీవుడ్ ఫిల్మ్ 'ఫారెస్ట్ గంప్'కు 'లాల్ సింగ్ చ‌డ్ఢా' రీమేక్‌.