English | Telugu
సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. అది వాస్తవం కాదని తేల్చి చెప్పిన ఏసీపీ!
Updated : Mar 29, 2025
ఈ ఏడాది జనవరి 16న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై అతని ఇంటిలోనే జరిగిన దాడి కేసులో షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే నిందితుడ్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సైఫ్‌పై కత్తితో దాడి చేసి అతన్ని గాయపరిచిన షెహజాద్ బెయిల్ కోసం కోర్టును అర్థిస్తున్నాడు. కానీ, ఇంతవరకు అతనికి బెయిల్ మంజూరు కాలేదు. ముంబై సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. తాను నిర్దోషినని, తనపై అక్రమ కేసులు పెట్టారని తన పిటిషన్‌లో నిందితుడు పేర్కొన్నాడు. అంతేకాదు, ఎఫ్‌ఐఆర్ సరిగా నమోదు చేయలేదని కూడా తన పిటిషన్‌లో ఆరోపించాడు. అయితే షెహజాద్ పోలీసులకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడని తెలుస్తోంది. ఈ కేసు బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటివరకు బాంద్రా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయలేదని తెలుస్తోంది.
షెహజాద్ దొంగతనం చేసేందుకు సైఫ్ ఇంటిలోకి ప్రవేశించాడని, ఆ సమయంలో జరిగిన ఘర్షణలో సైఫ్‌కి తీవ్రంగా గాయాలయ్యాయని, వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ఐదు రోజుల చికిత్స అనంతరం అతని డిశ్చార్జ్ చేశారని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి పూర్తి వివరాలు, అతను దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో నిందితుడు అతను కాదని, వేరొకరు ఉన్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. షెహజాద్ వేలిముద్రలు, ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలు ఒకటి కాదని కథనాలు వస్తున్నాయి. దీనిపై అదనపు పోలీస్ కమిషనర్ పరంజిత్ సింగ్ దహియా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కథనాల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని విధాలుగా విచారణ జరిపిన తర్వాత అసలైన నిందితుడినే అరెస్ట్ చేసి విచారిస్తున్నామని తెలిపారు. నిందితుడు షెహజాద్ కాదు అని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.