English | Telugu

రెండు నెలల తర్వాత జైలు నుంచి రిలీజైన రాజ్‌ కుంద్రా

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టు అయిన నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార‌వేత్త రాజ్‌ కుంద్రా మంగళవారం ముంబైలోని ఆర్ధ‌ర్ రోడ్డు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ కేసులో ముంబై కోర్టు ఆయ‌న‌కు సోమవారం బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయన ఈరోజు జైలు నుంచి విడుదల అయ్యారు.

అశ్లీల వీడియోల‌ను షూట్ చేసి.. యాప్స్ ద్వారా వాటిని విడుదల చేసిన‌ట్లు రాజ్‌ కుంద్రాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్రమంలో జులై 19న రాజ్‌ కుంద్రాతో పాటు ఆయన సహచరుడు ర్యాన్ థోర్పేను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల విచారణలో భాగంగా రాజ్‌ కుంద్రా ఫోన్‌, లాప్‌టాప్‌, హార్డ్ డిస్క్‌లల్లో మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించామని పోలీసులు చెప్పారు. అంతేకాదు, ఆ వీడియోలన్నింటినీ రాజ్‌ కుంద్రా రూ.9 కోట్లకు బేరం పెట్టినట్లు.. అతని వాట్సప్ చాట్‌ పరిశీలనలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

అయితే తాను నిర్మించింది పోర్న్ కంటెంట్ కాదంటూ మొదటి నుండి వాదిస్తున్న రాజ్ కుంద్రా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత ఎట్టకేలకు ఆయనకు బెయిల్ మంజూరైంది. 50 వేల రూపాయల పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ర్యాన్ థోర్పేకు సైతం బెయిల్ లభించింది.