English | Telugu

"న‌న్ను బెదిరించారు, బ‌ల‌వంతం చేశారు".. సీనియ‌ర్ రైట‌ర్‌పై కంగ‌న రివ‌ర్స్ కేస్‌!

ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత జావెద్ అఖ్త‌ర్‌పై ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ రివ‌ర్స్ కేసు పెట్టారు. బాలీవుడ్ స్టార్‌ హృతిక్ రోష‌న్‌తో కంగ‌న గొడ‌వ తెలిసిందే. ఆ సంద‌ర్భంలో జావెద్ అఖ్త‌ర్‌పై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయ‌డంతో ఆయ‌న ప‌రువున‌ష్టం దావా వేశారు. ఆ కేసులో మేజిస్ట్రేట్ ముందు కంగ‌న హాజ‌ర‌య్యారు. అయితే ఆమె కూడా ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు ఆమె త‌ర‌పు లాయ‌ర్ రిజ్వాన్ సిద్దిఖీ తెలిపారు. త‌న ఫిర్యాదులో ఆమె అఖ్త‌ర్‌పై బ‌ల‌వంతం, నేర‌పూరిత బెదిరింపు ఆరోప‌ణ‌లు చేశారు. అఖ్త‌ర్ త‌న‌నూ, త‌న సోద‌రినీ జుహూలోని ఇంటికి పిలిపించి బెదిరించార‌నీ, రాత‌పూర్వ‌కంగా క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేయాల్సిందిగా బ‌ల‌వంతం చేశార‌నీ కంగ‌న ఆరోపించారు.

అంతే కాదు, త‌న‌పై అఖ్త‌ర్ వేసిన ప‌రువున‌ష్టం కేసును ఇన్‌చార్జి కోర్టు నుంచి బ‌దిలీ చేయాల్సిందిగా కోరుతూ చీఫ్ మెట్రోపాలిట‌న్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు కంగ‌న‌. ఆ కోర్టులో త‌న‌కు సౌక‌ర్య‌క‌రంగా లేద‌నీ, త‌న విష‌యంలో ఆ కోర్టు ప‌క్ష‌పాతం చూపిస్తోంద‌నీ ఆమె ఆ పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ బ‌దిలీ పిటిష‌న్ అక్టోబ‌ర్ 1న విచార‌ణ‌కు రానుంది.

"నా స‌హ‌న‌టుడు (హృతిక్‌)కి రాత‌పూర్వ‌క క్ష‌మాప‌ణ తెల‌పాల‌ని న‌న్ను బ‌ల‌వంతం చేయ‌డానికి ఆయ‌న (అఖ్త‌ర్‌) ధైర్యం చేశాడు. త‌ద్వారా నా స‌హ‌న‌టునికి అనుకూలంగా డాక్యుమెంట్ సృష్టించాల‌ని ఆయ‌న కోరుకున్నాడు" అని త‌న పిటిష‌న్‌లో కంగ‌న తెలిపారు. త‌న నేర‌పూరిత చ‌ర్య‌ల ద్వారా ఆయ‌న త‌నను విప‌రీత‌మైన మాన‌సిక హింస‌కు గురిచేశాడ‌నీ, ఇప్ప‌టికీ అది త‌న మ‌న‌సుకు క‌ల‌వరాన్ని క‌లిగిస్తూనే ఉంద‌నీ ఆమె పేర్కొన్నారు.

త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి బ‌దులు, త‌న‌పైనే ఆయ‌న ప‌రువున‌ష్టం కేసు వేశార‌ని కంగ‌న చెప్పారు. "స‌దరు నిందితునిపై ఈ ఫిర్యాదు చేయ‌డానికి నా కుటుంబం ఇప్పుడు నాకు అనుమ‌తి ఇచ్చింద‌ని తెలియ‌జేసుకుంటున్నాను." అని త‌న పిటిష‌న్‌లో ఆమె తెలిపారు.