English | Telugu
శిల్పాశెట్టి భర్త అశ్లీల చిత్రాల బిజినెస్‌ను బయటపెట్టిన వాట్సాప్ చాట్స్!
Updated : Jul 20, 2021
అశ్లీల చిత్రాలను రూపొందించి, వాటిని కొన్ని యాప్‌ల ద్వారా పబ్లిష్ చేస్తున్నారనే కేసులో సోమవారం రాత్రి (జూలై 19) ముంబై పోలీసులకు చెందిన క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేయడంతో వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వార్తల్లోకెక్కాడు. ఈ కేసులో రాజ్‌ను 'కీలక కుట్రదారు'గా పోలీసులు పేర్కొన్నారు. ముంబై పోలీస్ కమిషనర్ ఒక పత్రికా ప్రకటనలో, "అశ్లీల చిత్రాలను రూపొందించి, కొన్ని యాప్స్ ద్వారా వాటిని పబ్లిష్ చేయడంపై ఫిబ్రవరి 2021లో ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో మేం మిస్టర్ రాజ్ కుంద్రాను జూలై 19 రాత్రి అరెస్టు చేశాం. అతను ఈ కేసులో ప్రధాన కుట్రదారుడిగా కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించి మా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి. దర్యాప్తు పురోగతిలో ఉంది." అని వెల్లడించారు.
ఈ కేసులో లేటెస్ట్ డెవలప్‌మెంట్స్‌లో భాగంగా యుకెకు చెందిన కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ అనే కంపెనీని నడుపుతూ అక్కడే నివాసం ఉంటున్న ప్రదీప్ బక్షి అనే వ్యాపారవేత్తకు రాజ్ కుంద్రా బంధువు అని క్రైమ్ బ్రాంచ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సంస్థకు ఛైర్మన్‌గా ఉండటంతో పాటు, రాజ్ కుంద్రా వ్యాపార భాగస్వామిగా కూడా బక్షి వ్యవహరిస్తున్నాడు.
పోర్నోగ్రాఫిక్ ఫిలిమ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగాయో బక్షి, కుంద్రా మధ్య వాట్సాప్ చాట్లు వెల్లడించాయి. లీకైన ఈ సంభాషణల ద్వారా పెద్ద మొత్తంలో వారు డబ్బు సంపాదించినట్లు బయటపడింది. రిపోర్ట్స్ ప్రకారం రాజ్ కుంద్రా పరోక్షంగా కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ యజమాని, పెట్టుబడిదారుడు. భారత్‌లో ఆ సంస్థ ప్రతినిధిగా కుంద్రా మాజీ పీఏ ఉమేశ్ కామత్ పనిచేశాడు. ఈ కంపెనీ అశ్లీల చిత్రాల నిర్మాణం కోసం కొంతమంది ఏజెంట్లకు కాంట్రాక్టులు ఇచ్చింది.
కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ కింద మోడల్-నటి గెహనా వశిష్ట్, ఉమేశ్ కామత్ అశ్లీల చిత్రాల్ని తీశారు. భిన్న రకాల పోర్న్ ఫిలిమ్స్ తీయడానికి ఈ కంపెనీ వారికి అడ్వాన్స్‌గా డబ్బును చెల్లించింది. ఈ చిత్రాల్ని హాట్‌షాట్ అనే సోషల్ మీడియా యాప్‌లో అప్‌లోడ్ చేశారు. దర్యాప్తులో దేశవ్యాప్తంగా పలు రకాల ఏజెంట్ల ద్వారా ఈ కంపెనీ పోర్నోగ్రఫీకి నిధులు అందజేయడంతో పాటు పోర్నోగ్రఫీ బిజినెస్ జరుపుతూ వచ్చిందని తేలింది.