English | Telugu

నా బయోపిక్‌ తీయొద్దు: ప్రియాంక చోప్రా

బాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే హాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడా సత్తా చాటుతోంది ప్రియాంక చోప్రా. అయితే ఆమె ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది. తమిళ సినిమా 'తమిజాన్‌' తో హీరోయిన్ గా కెరీర్‌ మొదలుపెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు అంతర్జాతీయంగా పాపులర్‌ అయ్యింది. అయితే ఆమె బయోపిక్ ను తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక తాజాగా తన బయోపిక్ వార్తలపై స్పందించింది.

బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా బయోపిక్ ను కూడా తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రియాంక మాత్రం తన బయోపిక్ ను అప్పుడే తీయవద్దని కోరింది. తన బయోపిక్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తే.. "దయచేసి నా బయోపిక్‌ తీయొద్దు. ఎందుకంటే నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకా ఆ దశకు చేరుకోలేదు" అని చెప్పుకొచ్చింది.

ప్రియాంక ఇటీవలే తన 39వ పుట్టినరోజును లండన్ లో జరుపుకుంది. తన కంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ను ఆమె పెళ్లాడిన సంగతి తెలిసిందే. 'మాట్రిక్స్‌', 'టెక్ట్స్‌ ఫర్‌ యు'తో పాటు పలు హాలీవుడ్‌ చిత్రాలు ఆమె చేతిలోఉన్నాయి.