English | Telugu

శిల్పాశెట్టికి రాజ్ కుంద్రా ఇచ్చిన ఈ ఖ‌రీదైన‌ గిఫ్ట్‌లు చూస్తే క‌ళ్లు తిరుగుతాయ్‌!

అశ్లీల చిత్రాల‌ను రూపొందించి, వాటిని మొబైల్ యాప్స్ ద్వారా ప‌బ్లిష్ చేస్తున్నార‌నే అభియోగంతో గ్లామ‌ర‌స్ యాక్ట్రెస్ శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రాను సోమ‌వారం రాత్రి ముంబై పోలీసులు అరెస్ట్ చేయ‌డం బాలీవుడ్‌లో.. ఆ మాట‌కొస్తే దేశ‌వ్యాప్తంగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించింది. మంగ‌ళ‌వారం రాజ్‌ను కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా, జూలై 23 వ‌ర‌కు పోలీస్ క‌స్ట‌డీని విధించింది. భ‌ర్త అరెస్ట్‌తో త‌న డాన్స్ రియాలిటీ షో సూప‌ర్ డాన్స్ 4 షూటింగ్‌కు వెళ్ల‌కుండా జుహు (ముంబై)లోని త‌మ బంగ్లాలో త‌ల్లి, చెల్లెలితో ఉండిపోయింది శిల్ప‌.

రాజ్ కుంద్రాతో శిల్ప వివాహం 2009లో జ‌రిగింది. వారికి వియాన్ అనే కొడుకు, స‌మీష అనే కుమార్తె ఉన్నారు. రాజ్ కేసు ద‌ర్యాప్తులో ఉన్న సంద‌ర్భంగా భార్య శిల్ప‌కు రాజ్ ఎలాంటి ఖ‌రీదైన కానుక‌లు ఇచ్చాడో ఓసారి చూద్దాం.

* 2012లో మూడో వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా దుబాయ్‌లోని వ‌ర‌ల్డ్ టాలెస్ట్ ట‌వ‌ర్ బుర్జ్ ఖ‌లీఫాలోని 19వ అంత‌స్తులో ఓ విలాస‌వంత‌మైన ఫ్లాట్‌ను కొన్నాడు రాజ్‌. దాని ఖ‌రీదు రూ. 50 కోట్లు. అయితే మ‌రో పెద్ద స్థ‌లం కొన‌డం కోసం ఆ త‌ర్వాత కొద్ది కాలానికే దాన్ని అమేసిన‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో శిల్ప వెల్ల‌డించింది.

* భార్య శిల్ప‌ను అత్యంత ఖ‌రీదైన కానుక‌ల్లో ముంచెత్త‌డం రాజ్‌కు స‌ర‌దా. ఇంగ్లండ్‌లో రాజ్ మ‌హ‌ల్ అనే 7-బెడ్‌రూమ్ విల్లాను కొని, దాన్ని శిల్ప‌కు బ‌హూక‌రించాడు.

* స‌ముద్రానికి అభిముఖంగా ఉన్న విల్లాను సొంతం చేసుకోవాల‌నేది శిల్ప క‌ల‌. ఆమె క‌ల‌ను భ‌ర్త రాజ్ నెర‌వేర్చాడు. ముంబైలోని త‌మ విలాస‌వంత‌మైన విల్లాను ఆమెకు కానుక‌గా ఇచ్చాడు రాజ్‌. దానికి 'కినారా' అనే పేరు పెట్టుకున్నారు.

* ప‌లువురు సెల‌బ్రిటీ క‌పుల్స్ త‌ర‌హాలోనే శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంప‌తుల‌కు అనేక కార్లున్నాయి. వాటిలో అత్యంత విలాస‌వంత‌మైన లంబోర్గిని కారు కూడా ఉంది. ఇండియాలో దాన్ని లాంచ్ చేయ‌క‌ముందే భార్య‌కు ఆ కారును కానుక‌గా ఇచ్చాడు రాజ్‌. దానికంటే ముందు బీఎండ‌బ్ల్యు జ‌డ్‌4 కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.

* శిల్ప చేతి వేలికి ఉన్న‌ పెద్ద డైమండ్ రాయి మ‌న‌ల్ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది. అది 20-క్యార‌ట్ ఎంగేజ్‌మెంట్ రింగ్‌. రాజ్ బ‌హూక‌రించిన‌ దాని విలువ‌.. అక్ష‌రాలా రూ. 3 కోట్లు.