English | Telugu
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. నిజంగా దొంగేనా..?
Updated : Jan 17, 2025
బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గురువారం (జనవరి 16) తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దొంగతనానికి వచ్చిన ఒక దుండగుడు, సైఫ్ అలీఖాన్ నివాసంలోనే ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను దాటుకుని నిందితుడు సైఫ్ ఇంట్లోకి ఎలా చోరబడ్డాడన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది నిజంగా దొంగ పనేనా లేక దీని వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. (Saif Ali Khan)
సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసి గాయపరిచిన నిందితుడిని తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ముంబైలోని బాంద్రా పోలీసు స్టేషన్ లో విచారిస్తున్నారు. సైఫ్ పై దాడి చేసిన నిందితుడి కోసం పది బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా గాలించిన పోలీసులు, ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశముంది.