English | Telugu
థియేటర్స్ ముందు నిరసనలు.. పలు నగరాల్లో ప్రదర్శన రద్దు!
Updated : Jan 18, 2025
కొన్ని సినిమాలు వివాదాల మధ్య విడుదలవుతుంటాయి. సినిమాలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చర్చలకు దారి తీస్తుంటాయి. ఆ కారణంగా సినిమా ప్రదర్శనలు రద్దు చేస్తుంటారు. అయితే ఈమధ్యకాలంలో అలాంటి సందర్భాలు లేవు. తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ ప్రారంభం నుంచి వివాదాలు ఎదుర్కొంటూనే ఉంది. జనవరి 17న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైంది. అయితే సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి ఇచ్చిన పిలుపు మేరకు పంజాబ్‌లోని లూథియానా సహా పలు నగరాల్లో అన్ని సినిమా థియేటర్ల ముందు సిక్కులు నిరసనలకు దిగారు. దీంతో ఆయా నగరాల్లో ‘ఎమర్జెన్సీ’ చిత్రం ప్రదర్శనను రద్దు చేశారు.
సిక్కు సంస్థల ప్రతినిధులు థియేటర్ల ముందు పెద్ద ఎత్తున మోహరించడంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యగా ప్రదర్శనలను రద్దు చేశారు. సిక్కుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని, అందుకే దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని కమిటీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. సిక్కు గ్రూపులు తమ నిరసన వ్యక్తం చేయనున్నారని ముందే తెలిసి ఉండడంతో పోలీసుశాఖ అప్రమత్తంగా ఉంది. ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కొన్ని థియేటర్ల ముందు ప్రదర్శన రద్దు అనే నోటీసులు కూడా పెట్టారు. కొన్ని మల్టిప్లెక్సులలో అడ్వాన్స్‌గా టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు వాపసు చేస్తున్నారు.