English | Telugu

ఆస్కార్‌పై ఇండియా పెట్టుకున్న ఆశలు అడియాసలేనా.. అయినా కొంత సంతోషమే!

గత ఏడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఆస్కార్‌ అవార్డు సాధించడంతో అందరూ పండగ చేసుకున్నారు. వరసగా రెండో సంవత్సరం కూడా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకోవాలనే ప్రయత్నం నార్త్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో జరిగింది. ఈ సంవత్సరం కూడా ఏదో ఒక విభాగంలో ఆస్కార్‌ అవార్డు వస్తుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే ఒక అద్భుతమైన సినిమాను భారత దేశం తరఫున ఆస్కార్‌కు నామినేట్‌ చేశారు. ఆమిర్‌ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్‌’ చిత్రాన్ని బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు అధికారికంగా పంపారు. అయితే ఈ చిత్రానికి నిరాశే ఎదురైంది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ చేసిన షార్ట్‌ లిస్టు నుంచి ఈ సినిమా తప్పుకోవాల్సి వచ్చింది. 

లాపతా లేడీస్‌ ఆస్కార్‌కి నామినేట్‌ అయిన తర్వాత సినిమా టైటిల్‌ను ‘లాస్ట్‌ లేడీస్‌’ గా మార్చారు. లాస్ట్‌ అంటే మిస్సింగ్‌ అనే అర్థం వస్తుంది. నిజానికి ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లో చోటు సంపాదించుకోలేకపోవడం ఈ సినిమాకి మిస్సింగ్‌ అనే చెప్పాలి. ఇండియాలో ‘లాపతా లేడీస్‌’ చిత్రం చాలా పెద్ద హిట్‌ అయింది. దీంతో ఈ సినిమాను ఆస్కార్‌కి పంపారు. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో 85 సినిమాలు ఉండగా వాటిని షార్ట్‌ ఔట్‌ చేస్తే 15 సినిమాలు మిగిలాయి. అందులో లాపతా లేడీస్‌ లేకపోవడం యూనిట్‌ని ఎంతో బాధించింది. 

ఇదిలా ఉంటే.. మరో హిందీ సినిమా ఈ షార్ట్‌ లిస్ట్‌లోకి వచ్చింది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలోనే ఆ సినిమా కూడా ఉండడం విశేషం. ఆ సినిమా పేరు ‘సంతోష్‌’. అయితే ఈ సినిమా యూకే నుండి నామినేట్‌ అయింది. నార్త్‌ ఇండియాలోని గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి సంధ్య సూరి దర్శకత్వం వహించారు. షహానా గోస్వామి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. తమ సినిమా ష్టార్ట్‌ లిస్ట్‌లో ఉండడంతో ‘సంతోష్‌’ యూనిట్‌ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. మరి ఆ 15 సినిమాల్లో ఏ సినిమాకి ఆస్కార్‌ దక్కుతుందో చూడాలి.