English | Telugu

ట్విట్ట‌ర్ అద్దె ఇల్లు.. 'కూ' సొంత ఇల్లు! కంగ‌న‌కు 'కూ' స్వాగ‌తం!

బాలీవుడ్ న‌టి, ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ను మంగ‌ళ‌వారం శాశ్వంతంగా సోష‌ల్ మీడియా దిగ్గ‌జాల్లో ఒక‌టైన ట్విట్ట‌ర్ శాశ్వంతంగా నిషేధించింది. ఆ మ‌రుస‌టి రోజే దాని ప్ర‌త్య‌ర్థి యాప్ అయిన 'కూ' కంగ‌న‌ను స్వాగ‌తించింది. 'కూ' దేశీయంగా త‌యారైన ప్లాట్‌ఫామ్ అనీ, అది సొంత ఇల్లు లాంటిదైతే, మిగ‌తావ‌న్నీ అద్దె ఇళ్లు లాంటివ‌నీ పేర్కొంటూ, ఆమె న‌మ్మిన అభిప్రాయాల‌ను నిస్సంకోచంగా 'కూ' ద్వారా వ్య‌క్తం చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది.

ఈ సంద‌ర్భంగా 'కూ' స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు అప్ర‌మేయ రాధాకృష్ణ 2021 ఫిబ్ర‌వ‌రి 16 నాటి కంగ‌న మెసేజ్‌ను షేర్ చేశారు. "ఇది కంగ‌న రౌత్ ఫ‌స్ట్ 'కూ'. 'కూ'ను సొంత ఇల్లులా భావించి త‌న అభిప్రాయ‌ల‌ను వ్య‌క్తీక‌రించ‌వ‌చ్చు, మిగ‌తావ‌న్నీ అద్దెవే." అంటూ 'కూ' ద్వారా తెలిపారు.

ట్విట్ట‌ర్ యాప్‌లోని మెసేజ్‌ల‌ను ఎలాగైతే ట్వీట్స్ అంటున్నారో, అలాగే 'కూ' యాప్‌లోని మెసేజ్‌ల‌ను 'కూ' అని పిలుస్తున్నారు. ఫిబ్ర‌వ‌రిలో పోస్ట్ చేసిన త‌న ఫ‌స్ట్ 'కూ'లో ఇది కొత్త ప్లేస్ అనీ, అంద‌రికీ తెలియ‌డానికి కొంత టైమ్ ప‌డుతుంద‌నీ చెప్పింది కంగ‌న‌. "అద్దె ఇల్లు అద్దె ఇల్లే, ఒక‌రి సొంత ఇల్లు ఎప్ప‌టికీ వారి సొంత ఇల్లే." అని ఆ 'కూ'లో ఆమె రాసింది. 'కూ'లో ఆమెకు 4.48 ల‌క్ష‌ల మంది ఫాలోయ‌ర్స్ ఉన్నారు.

రెండు రోజుల క్రితం ప‌దే ప‌దే కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్‌ను పోస్ట్ చేయ‌డం ద్వారా కంగ‌న‌ ట్విట్ట‌ర్ రూల్స్ అండ్ రెగ్యులేష‌న్స్‌ను ఉల్లంఘించార‌ని దాని యాజ‌మాన్యం తెలిపింది. ఆమె విద్వేష‌పూరిత‌మైన‌, అభ్యంత‌ర‌క‌ర‌మైన బిహేవియ‌ర్ వ‌ల్ల స‌స్పెన్ష‌న్‌ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ట్విట్ట‌ర్ చెప్పింది.

ఇటీవ‌ల ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల త‌ర్వాత కంగ‌నా ర‌నౌత్ చేసిన ట్వీట్ కాంట్ర‌వ‌ర్సీ సృష్టించింది. వెస్ట్ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని టార్గెట్ చేస్తూ, ఆమెను కించ‌ప‌రిచేలా ఆ ట్వీట్ ఉండ‌టంతో అన్ని వైపుల నుంచీ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక ప‌శ్చిమ బెంగాల్‌లో హింస చెల‌రేగే అవ‌కాశం ఉంద‌ని జ‌ర్న‌లిస్ట్ స్వ‌ప‌న్‌దాస్ గుప్తా ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. దీనికి కంగ‌న ఇచ్చిన రిప్లై ట్వీట్ కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2000వ సహస్రాబ్దం ప్రారంభంలో ప్రదర్శించిన విరాట్ స్వరూపంతో మమతా బెనర్జీని లొంగదీయాలని కంగన ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది దుమారం సృష్టించింది దీంతో ఆమె ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ను ప‌ర్మినెంట్‌గా సస్పెండ్ చేస్తూ ట్విట్ట‌ర్ నిర్ణ‌యం తీసుకుంది.

తన అకౌంట్‌ను ట్విట్ట‌ర్‌ సస్పెండ్ చేయడంపై కంగన స్పందిస్తూ, తన వాదనను ట్విటర్ రుజువు చేసిందన్నారు. బ్రౌన్ పీపుల్‌ను బానిసలుగా చేసుకునే హక్కు తమకు ఉందని శ్వేత జాతీయులు పుట్టుక నుంచి భావిస్తారనీ, ట్విటర్ యాజమాన్యం అమెరికన్లు కాబ‌ట్టే ఈ ప‌ని చేశార‌నీ అన్నారు. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఏం ఆలోచించాలో మనకి చెప్పాలని వాళ్లు అనుకుంటారని ఆమె చెప్పారు. అదృష్టవశాత్తూ మాట్లాడటానికి తనకు అనేక వేదికలు ఉన్నాయనీ, వాటి ద్వారా తాను తన గొంతు వినిపిస్తాననీ అన్నారు. అయితే వేలాది సంవత్సరాలుగా హింస, బానిసత్వం, సెన్సార్‌షిప్‌కు గురవుతున్న మన దేశ ప్రజల కోసం తన హృదయం తల్లడిల్లుతోందని కంగ‌న‌ చెప్పారు.